Malaysia: మలేషియా పార్లమెంట్‌ రద్దు.. ముందస్తు ఎన్నికల కోసమేనా?

మలేషియా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి ఇస్మాయిల్‌ సబ్రీ యాకొబ్‌ సోమవారం ప్రకటించారు. స్థానికంగా రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 11 Oct 2022 00:04 IST

కౌలాలంపూర్: మలేషియా(Malaysia) పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి ఇస్మాయిల్‌ సబ్రీ యాకొబ్‌(Ismail Sabri Yaakob) సోమవారం ప్రకటించారు. కొవిడ్‌ పరిస్థితులతోపాటు అవినీతి, కుంభకోణాల నుంచి దేశం బయటపడుతున్న ప్రస్తుత తరుణంలో.. స్థానికంగా రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి.. మలేషియాలో వచ్చే ఏడాది సెప్టెంబరులో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ సాధిద్దామంటూ.. సొంత పార్టీ ‘యునైటెడ్ మలేస్ నేషనల్ ఆర్గనైజేషన్(UMNO)’ నుంచే ప్రధానిపై తీవ్ర ఒత్తిడి రావడం గమనార్హం!

‘ఆదివారం మలేషియా రాజు అల్‌ సుల్తాన్‌ అబ్దుల్లాను కలిశా. పార్లమెంటును రద్దు చేసేందుకు ఆయన అనుమతి కోరా. నా అభ్యర్థనను ఆయన అంగీకరించారు’ అని ప్రధాని యాకొబ్‌ సోమవారం టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు.  ‘ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రాజు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధాని చేసిన అభ్యర్థనకు అంగీకరించడం తప్ప వేరే మార్గం లేకపోయింది’ అని రాజ భవనం తెలిపింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని ప్రకటించనుంది. ఒకవైపు.. 2018 నుంచి మూడు ప్రభుత్వాలు మారడంతో ప్రజలు విసిగిపోయి ఉండటం, మరోవైపు.. కొవిడ్‌ తర్వాత జరిగే మొదటి ఎన్నికలు కావడంతో ఈ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. 

నాలుగేళ్లలో మూడు ప్రభుత్వాలు..

2018 ఎన్నికల నాటినుంచి మలేషియాలో రాజకీయ గందరగోళం నెలకొంది. 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన యూఎంఎన్‌ఓ కూటమిని.. ఆ ఎన్నికల్లో మహతీర్ మహమ్మద్ ఓడించారు. ప్రభుత్వ ఖజానా నుంచి బిలియన్ల డాలర్లు దోచుకున్న కుంభకోణంలో భాగమైన అప్పటి ప్రధాని నజీబ్‌ రజాక్‌ గద్దె దిగారు. అయితే, అంతర్గత పోరుతో 22 నెలలకే  మహతీర్ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం మహతీర్‌ కుడి భుజంగా పేరొందిన యాసిన్ అధికారంలోకి వచ్చారు. కొవిడ్‌ నిర్వహణలో వైఫ్యలం కారణంగా ప్రజల ఆగ్రహాన్ని చవిచూడటంతో.. రెండేళ్ల లోపే రాజీనామా చేశారు. 2021 ఆగస్టులో యూఎంఎన్‌ఓ కూటమికి చెందిన యాకొబ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనకు అధికారం దక్కిన తీరుపై విమర్శలు ఉన్నాయి. వచ్చే సెప్టెంబరు నాటికి ఇవి మరింత ముదిరే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని