Malaysia: మలేసియా మాజీ ప్రధాని ముహిద్దీన్‌ యాసిన్‌ అరెస్ట్‌

అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో మలేసియా (Malaysia) మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్‌ యాసిన్‌ అరెస్టయ్యారు. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై యాసిన్‌పై కేసు నమోదయ్యింది.

Published : 09 Mar 2023 23:45 IST

కౌలాలంపుర్‌: మలేసియా (Malaysia) మాజీ ప్రధానమంత్రి ముహిద్దీన్‌ యాసిన్‌ అరెస్టయ్యారు. అవినీతి (Corruption) ఆరోపణలపై అరెస్టు చేసిన అవినీతి నిరోధక విభాగం అధికారులు.. ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో మలేసియాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అధికారానికి దూరమైన మూడు నెలలకే యాసిన్‌పై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం.

ప్రధానమంత్రిగా 17 నెలలపాటు పదవిలో ఉన్న సమయంలో ముహిద్దీన్‌ యాసిన్‌ (Muhyiddin Yasin) అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంలో అవినీతి చోటుచేసుకుందన్నది ప్రధాన ఆరోపణ. గతేడాది నవంబర్‌లో కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim).. యాసిన్‌ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అవినీతి నిరోధక విభాగం ముహిద్దీన్‌ యాసిన్‌ అరెస్టు చేసింది. అయితే, వీటిని తోసిపుచ్చిన యాసిన్‌.. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు.

2018 నుంచి ఇప్పటివరకు మలేసియాకు నలుగురు ప్రధానమంత్రులుగా పనిచేశారు. మార్చి 2020 నుంచి ఆగస్టు 2021 వరకు ముహిద్దీన్‌ యాసిన్‌ అధికారంలో ఉన్నారు. ఓవైపు ప్రభుత్వంలో అంతర్గత పోరు, మరోవైపు కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ, ఆర్థికవ్యవస్థ క్షీణించడం వంటి సవాళ్లను ఆయన ఎదుర్కొన్నారు. సుమారు ఏడదిన్నర పాటు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చినప్పటికీ పార్లమెంటులో మాత్రం మెజారిటీ సంపాదించలేకపోయారు. దీంతో ముహిద్దీన్‌ యాసిన్‌ ఆగస్టు 2021లో రాజీనామా చేశారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో చిన్న పార్టీలతో కలిసి అన్వర్‌ ఇబ్రహీం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, అంతకుముందు మలేసియా ప్రధానిగా కొనసాగిన నాజిబ్‌ రజాక్‌పైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో అరెస్టైన నాజిబ్‌ రజాక్‌కు 12ఏళ్ల జైలు శిక్ష పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు