‘మాట వినకపోతే భార్యలను కొట్టండి’.. భర్తలకు మహిళా మంత్రి సలహా!

భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు రావడం, తర్వాత  ఎప్పటిలాగా కలిసిమెలసి ఉండటం సహజం. అయితే, కొంతమంది భర్తలు మరీ చిన్న చిన్న విషయాలకే తమ భార్యలను చిత్రహింసలకు గురిచేస్తుంటారు.

Published : 19 Feb 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు రావడం, తర్వాత ఎప్పటిలాగే కలిసిమెలసి ఉండటం సహజం. అయితే, కొంతమంది భర్తలు మరీ చిన్న చిన్న విషయాలకే తమ భార్యలను చిత్రహింసలకు గురిచేస్తుంటారు. అతని కుటుంబసభ్యులు సైతం వేధిస్తుంటారు. ఇలా మహిళలపై జరుగుతున్న గృహ హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమాజంలో పెద్దగా మార్పు రావడం లేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వేధింపులకు గురైన మహిళలకు తోటి మహిళలు అండగా నిలుస్తారు. కానీ, ఓ మహిళా మంత్రి మాత్రం ఇందుకు పూర్తివిరుద్ధంగా వ్యవహరించారు. మాట వినని భార్యలను కొట్టండి అని భర్తలకు ఆమె సలహాలిస్తున్నారు.  

ఇంతకీ ఆ మంత్రి ఎవరు, అసలేం జరిగిందంటే.. మలేసియాకు చెందిన మహిళా, కుటుంబ, కమ్యూనిటీ అభివృద్ధి డిప్యూటీ మంత్రి సిటి జైల్లా మహమ్మద్ యూసోఫ్‌ (Siti Zailah Mohd yusoff)ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మాట వినని, మొండిగా ఉండే భార్యలను కొట్టాలని భర్తలకు ఆమె సలహా ఇచ్చింది.  ‘మొండి భార్యలను వారితో మాట్లాడి క్రమశిక్షణగా ఉంచాలి. అప్పుడు కూడా భార్యలు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే, మూడు రోజులు వారికి దూరంగా పడుకోవాలి. అయినా భార్యలు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే.. వారిని భర్తలు సున్నితంగా కొట్టవచ్చు. భార్యపై భర్త అతని కఠినత్వాన్ని, ఆమెలో మార్పును ఎంతగా కోరుకుంటున్నాడో చూపించవచ్చు. మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి’ అని  మహిళా మంత్రి భర్తలకు సలహాలిచ్చారు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు గృహ హింసను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు మంత్రి వెంటనే రాజీనామా చేయాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని