Shocking incident: బతికున్న వ్యక్తిని చనిపోయాడనుకొని..!

కరోనా వైరస్‌ కల్లోలంతో విలవిల్లాడుతున్న చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షాంఘైలోని వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఓ సీనియర్‌ సిటిజన్‌ చనిపోయాడని.....

Updated : 12 May 2022 17:17 IST

షాంఘై: కరోనా వైరస్‌ కల్లోలంతో విలవిల్లాడుతున్న చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షాంఘైలోని వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఓ సీనియర్‌ సిటిజన్‌ చనిపోయాడని పొరపాటు పడిన సిబ్బంది.. అతడు సజీవంగా ఉండగానే ఓ బ్యాగ్‌లో ప్యాక్‌ చేసి మార్చురీకి తరలించిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. షాంఘైలో కొవిడ్‌ ఉద్ధృతితో నెల రోజులకు పైగా కొనసాగుతున్న కఠిన లాక్‌డౌన్‌పై అక్కడి జనం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ఈ దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూడటం గమనార్హం. వృద్ధుడి బాడీని ఓ పసుపు రంగు బ్యాగ్‌లో ప్యాక్‌ చేసి పుటువో జిల్లాలో షాంఘై జిన్‌చాంగ్‌జెంగ్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌కి తీసుకు రాగా.. దాన్ని ఇద్దరు సిబ్బంది పరిశీలిస్తున్నట్టుగా ఉన్న వీడియోలు చైనా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఆస్పత్రి బయట రక్షిత దుస్తుల్లో ఉన్న ఇద్దరు సిబ్బందిలో ఒకరు ఆ బ్యాగ్‌ని తెరిచి చూసి.. వృద్ధుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పినట్టుగా వీడియోలో రికార్డయిందని అక్కడి మీడియా పేర్కొంది.

అయితే, నిరసనలకు భయపడిన సిబ్బంది.. ఆ రోగి ఊపిరి పీల్చుకుంటాడేమోనని బ్యాగ్‌ను సీల్‌ చేయడం, ఆ వృద్ధుడిని తిరిగి సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లే ముందు తెల్లని షూట్‌లో ఉన్న మరో ఇద్దరితో మాట్లాడటం వంటి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ తప్పునకు బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. షాంఘైలో 1983లో ఏర్పాటు చేసిన ఈ వృద్ధుల సంరక్షణ కేంద్రంలో దాదాపు 100 మందికి పైగా సీనియర్‌ సిటిజన్లు ఉంటున్నారు. ఈ ఘటనపై వృద్ధుల కేర్‌ సెంటర్‌ యాజమాన్యం క్షమాపణలు కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని