Monterey Park shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. అనుమానితుడి ఆత్మహత్య!

అమెరికాలో మాంటెరీ పార్క్‌లో కాల్పులకు పాల్పడింది ఓ వృద్ధుడిగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated : 23 Jan 2023 10:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)లోని మాంటెరీ పార్క్‌(Monterey Park)లో బాల్‌రూమ్‌ డ్యాన్స్‌ స్టూడియోలో మారణహోమానికి పాల్పడినట్లు భావిస్తున్న వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. షాట్‌గన్‌తో తనకు తానే కాల్చుకున్నట్లు అతడి శరీరంపై గాయం ఉందని పోలీసులు చెప్పారు. అనుమానితుడు చైనా నుంచి వలస వచ్చిన హూ కాన్‌ ట్రాన్‌ (72)గా గుర్తించారు. ట్రాన్‌ కాల్పులకు పాల్పడిన తర్వాత కొందరు వ్యక్తులు అతడి ఆయుధాన్ని లాక్కొన్నట్లు సమాచారం. అతడు గతంలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేశాడు. దీంతోపాటు ‘ట్రాన్స్‌ ట్రక్కింగ్‌ ఐఎన్‌సీ’ పేరిట వ్యాపారం చేశాడు.

కాల్పులు జరిపిన డ్యాన్స్‌ స్టూడియోకు ట్రాన్‌ తరచూ వస్తాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అక్కడ అతడి మాజీ భార్యతో కలిసి సమయం గడిపేవాడని వారు చెప్పారు. అతడు 2006లోనే భార్య నుంచి విడాకులు తీసుకొన్నాడు.  ఘటనా స్థలానికి సమీపంలోని సాన్‌ గాబ్రియేల్‌లో అతడు నివాసం ఉండేవాడు. స్టూడియోలోని శిక్షకులు, చాలా మంది వ్యక్తులతో అతడికి అంతగా పడేది కాదని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు అతడికి వేగంగా కోపం వచ్చేదని పేర్కొన్నారు. నిన్నమాజీ  భార్యను వెతుక్కొంటూ ట్రాన్‌ డ్యాన్స్ స్టూడియోకు వచ్చినట్లు  స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అక్కడ ఆమెను చూడగానే విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లు వెల్లడించాయి.

లాస్‌ఏంజెలెస్‌ ప్రాంతంలోని బాల్‌రూం డ్యాన్స్‌ క్లబ్‌ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చైనా నూతన లూనార్‌ సంవత్సర వేడుకల నేపథ్యంలో వేలాది మంది అక్కడ గుమిగూడారు. ఆ సమయంలో ఓ సాయుధుడు మెషీన్‌ గన్‌తో కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నగరంలో 60 వేల మంది జీవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని