Published : 07 Jun 2022 17:41 IST

US Museum: ప్రియురాలిపై కోపం.. మ్యూజియంపై ప్రతాపం!

50 లక్షల డాలర్ల మేర కళాఖండాల ధ్వంసం!

వాషింగ్టన్‌: ప్రియురాలితో గొడవపడి బయటకు వచ్చిన యువకుడు.. కోపంతో ఓ మ్యూజియంపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఏకంగా 50 లక్షల డాలర్ల విలువైన కళాఖండాలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేయడం గమనార్హం. అమెరికాలోని ‘డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌’లో ఈ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల బ్రియాన్‌ హెర్నాండెజ్‌ గత బుధవారం రాత్రి మ్యూజియంలోకి చొరబడి.. ఈ మేర నష్టం కలిగించినట్లు డల్లాస్‌ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రేయసిపై కోపంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అతను వెల్లడించాడని చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తొలుత ఆ యువకుడు స్టీల్‌ కుర్చీతో మ్యూజియం గ్లాస్ డోర్‌ను పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. అనంతరం అక్కడి డిస్‌ప్లే కేసులను ధ్వంసం చేసేందుకు ఓ స్టూల్‌ ఉపయోగించాడు. ఈ క్రమంలో 2,500 ఏళ్లనాటి పురాతన గ్రీకు కళాఖండాలను నాశనం చేశాడు. ఇందులో లక్ష డాలర్ల విలువైన ఓ గ్రీకు కూజా ఉంది. 10 వేల డాలర్ల విలువైన ఓ నేటివ్‌ అమెరికన్ కళాఖండం, రెండు విలువైన కుండలతో సహా అనేక పురాతన వస్తువులను నాశనం చేశాడు. అంతేకాకుండా.. మ్యూజియంలోని టెలిఫోన్‌, కంప్యూటర్‌, బెంచ్‌నూ ధ్వంసం చేశాడని మ్యూజియం సిబ్బంది వెల్లడించారు.

మోషన్ డిటెక్టర్ అలారం మోగడంతో.. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు మ్యూజియం మెయిన్ ఫ్లోర్‌లో అతన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడేం చేస్తున్నావని ప్రశ్నించగా.. తన ప్రియురాలిపై కోపం వచ్చిందని, అందుకే చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు చెప్పాడన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. మరోవైపు.. జరిగిన నష్టాన్ని కచ్చితంగా లెక్కగట్టేందుకు బీమా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు మ్యూజియం డైరెక్టర్ అగస్టిన్ ఆర్టీగా తెలిపారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని