USA: భారత సంతతి చిన్నారి మరణం.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో (America) లూసియానాలో భారత సంతతికి చెందిన చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. తల్లి దండ్రులతో కలిసి సొంత హోటల్‌లో నివాసముంటున్న ఆ చిన్నారి తలకు బుల్లెట్ తగలడంతో ఆ ప్రమాదం జరిగింది. 

Updated : 26 Mar 2023 19:34 IST

వాషింగ్టన్‌: భారత సంతతికి (Indian-Origin) చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి మరణానికి కారణమైన యువకుడికి 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికా (America) లూసియానాలో 2021లో జరిగిన ఈ కేసులో న్యాయస్థానం ఇటీవల తీర్పు వెలువరించింది. ఓ హోటల్‌ రూమ్‌లో ఆడుకుంటోన్న చిన్నారి తలకు బుల్లెట్‌ తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

భారత్‌కు చెందిన విమల్‌-స్నేహాల్‌ పటేల్‌ దంపతులు లూసియానాలో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. తమ చిన్నారి మాయ, మరో శిశువుతో కలిసి ఆ హోటల్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో వారు నివాసముంటున్నారు. ఓ రోజు హోటల్‌ బయట పార్కింగ్‌లో చిన్న గొడవ జరిగింది. శ్రేవ్‌పోర్టుకు చెందిన జోసెఫ్‌ లీ స్మిత్‌ అనే యువకుడు మరో వ్యక్తితో అక్కడ తగాదా పడ్డాడు. ఈ సమయంలో తన దగ్గరున్న తుపాకితో ఎదుటివ్యక్తి నుదుటిపై స్మిత్‌ దాడి చేశాడు. దీంతో చేతిలో ఉన్న ఆ తుపాకి పేలి.. హోటల్‌ రూంలో తల్లితో ఆడుకుంటున్న చిన్నారికి తగిలింది. వెంటనే మాయ పటేల్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు ప్రాణాలతో పోరాడిన ఆ చిన్నారి చివరకు మార్చి 23, 2021న కన్నుమూసింది.

ఈ కేసును విచారించిన అక్కడి జిల్లా న్యాయస్థానం.. చిన్నారి మృతికి కారణమైన స్మిత్‌కు 60ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు విచారణను అడ్డుకున్నందుకు 20 ఏళ్లు, తీవ్ర నేరాలు పునరావృతం చేస్తున్నందుకు మరో 20ఏళ్లు.. మొత్తంగా 100 ఏళ్లు జైల్లోనే గడపాలని ఆదేశించింది. పెరోల్‌ లేదా శిక్షలో తగ్గింపు వంటి ఎటువంటి అవకాశాలు లేకుండా శిక్ష అమలు చేయాలని తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని