Contact lense: కాంటాక్ట్‌ లెన్స్‌తో నిద్రపోతే.. కన్నునే తినేసింది!

కాంటాక్ట్‌ లెన్స్‌ను (Contact Lenses) సరిగా ఉపయోగించకపోవడంతో క్రుమ్‌హోల్జ్‌ (Krumholz) అనే వ్యక్తి పూర్తిగా కంటిచూపును కోల్పోయాడు.అతడి కంట్లో భయంకరమైన పరాన్న జీవి ఉంటున్నట్లు వైద్యులు తేల్చారు.

Published : 18 Feb 2023 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చూపు సరిగా లేనివారు సాధారణంగా కళ్లద్దాలు (spectacles) వాడుతుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో వాటి స్థానంలో కాంటాక్ట్‌ లెన్స్‌ (Contact Lenses) వాడే వారి సంఖ్య పెరిగింది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కాంటాక్ట్‌ లెన్స్‌ వాడితే కళ్లకే ప్రమాదం. పడుకునేటప్పుడు కూడా వాటిని తీయకపోవడంతో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన క్రుమ్‌హోల్జ్‌ (Krumholz) అనే 21 ఏళ్ల యువకుడు పూర్తిగా కంటి చూపునే కోల్పోయాడు.

క్రుమ్‌హోల్జ్‌ అనే యువకుడు గత 7 ఏళ్లుగా కాంటాక్ట్‌ లెన్స్‌ వాడుతున్నాడు. అప్పుడప్పుడూ వాటిని తీయకుండానే నిద్రపోయేవాడు. కొన్ని సార్లు అతడి కళ్లు గులాబీ రంగులోకి మారడం, దురద పెట్టడం జరిగేవి. అయితే, దీనిని అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య లెన్స్‌ పెట్టుకున్నా కనిపించకపోవడంతో  వైద్యుల్ని సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అతడి కంట్లో ప్రమాదకరమైన అకంతమొయిబా కెరటైటిస్‌ అనే పరాన్నజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కంటి మొత్తాన్ని తినేశాయని, ఫలితంగా అతడు పూర్తిగా చూపు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. 

దీంతో తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకుండా ఉండేందుకు అతడు అవగాహన కల్పిస్తున్నాడు. కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండా తరచూ నిద్ర పోయినందుకు తనకు ఏం జరిగిందో Gofundme వెబ్‌పేజీలో అందులో రాసుకొచ్చాడు. ‘‘ కొన్ని సార్లు పడుకొని లేచిన తర్వాత కుడి కన్ను కాస్త దురదగా అనిపించేంది. గులాబీ రంగులోకి మారేది. వైద్యుల్ని సంప్రదిస్తే కంటిలో హెచ్‌ఎస్‌వీ1 అనే వైరస్‌ ఉన్నట్లు  చెప్పారు. కానీ, దాదాపు ఐదుగురు కంటి వైద్య నిపుణులు, ఇద్దరు కార్నియా నిపుణుల్ని సంప్రదించిన తర్వాత అది వైరస్‌ కాదని భయంకరమైన పరాన్నజీవి అని తేలింది’’ అని క్రుమ్‌హోల్జ్‌  చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత శస్త్ర చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని, ఆ పరాన్న జీవి కంటిని పూర్తిగా తినేసిందని చెప్పాడు. అందుకే కాంటాక్ట్‌ లెన్స్‌ ఉపయోగించే వారంతా జాగ్రత్తగా ఉండాలని, నిద్రపోయినప్పుడు, స్నానం చేస్తున్న సమయంలో కచ్చితంగా వాటిని తీసేయాలని చెబుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని