డిలీట్‌ చేసిన మెసేజ్‌లు భార్య కంటికి.. యాపిల్‌పై రూ.53 కోట్లకు దావా

Man Sues Apple: తాను డిలీట్‌ చేసిన మెసేజ్‌లను భార్య గుర్తించడంతో యాపిల్‌ కంపెనీపై ఏకంగా రూ.53 కోట్లకు దావా వేశాడో వ్యక్తి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 17 Jun 2024 14:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార్యకు తెలియకుండా అమ్మాయిలతో రాసలీలలు సాగించాడో వ్యక్తి. అది బయటపడకుండా ఉండేందుకు మెసేజ్‌లు డిలీట్‌ చేశాడు. అయినా అవి ఆమె కంట పడటంతో భర్తకు విడాకులిచ్చింది. దీనికి కారణం యాపిలేనంటూ ఆ సంస్థ (Apple)పై దావా వేశాడో ప్రబుద్ధుడు. తనకు జరిగిన నష్టానికి రూ.53 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఇంగ్లాండ్‌ (England)లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

లండన్‌కు చెందిన ఓ వ్యాపారి తన ఐఫోన్‌ (iPhone)లోని ఐ మెసేజ్‌ యాప్‌ నుంచి సెక్స్‌వర్కర్లతో చాటింగ్‌ చేశాడు. భార్యకు ఈ విషయం తెలియొద్దని వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేశాడు కూడా..! అయితే, ఇదే యాపిల్‌ ఐడీని తన కుటుంబానికి చెందిన ఐమ్యాక్‌లోనూ ఉపయోగించాడు. దీంతో ఫోన్లో మెసేజ్‌లు డిలీట్ చేసినప్పటికీ ఐమ్యాక్‌ (iMac)లో అలాగే ఉండిపోయాయి. ఓ రోజు వాటిని చూసిన భార్య అతడి నుంచి విడిపోయింది. దీంతో సదరు వ్యక్తి యాపిల్‌పై దావా వేశాడు.

‘‘ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్‌ (Deleted Messages) చేసినప్పుడు అవి పూర్తిగా తొలగిపోయాయనే అనుకుంటాం. అంతేగానీ, లింక్‌ చేసిన అన్ని డివైజ్‌లలో మెసేజ్‌లు ఉండిపోతాయన్న విషయం యాపిల్‌ యూజర్లకు స్పష్టంగా చెప్పలేదు. ‘ఈ ఒక్క డివైజ్‌లోనే మెసేజ్‌లు డిలీట్‌ అయ్యాయి’ అని సందేశమిస్తే యూజర్లు అప్రమత్తమవుతారు కదా. ఈ విషయాన్ని యాపిల్ సరిగ్గా చెప్పలేదు. నేను డిలీట్‌ చేసిన మెసేజ్‌లను గుర్తించిన నా భార్య విడాకులిచ్చింది. దీనివల్ల నేను 5 మిలియన్‌ పౌండ్లు నష్టపోయా. ఈ విషయాన్ని నేను మెల్లిగా సర్దిచెప్పేవాణ్ని. అప్పుడు మా వివాహబంధం కొనసాగేదేమో..! ఇప్పుడు ఆమె నేరుగా మెసేజ్‌లు చూడటం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది’’ అని ఆ వ్యక్తి తన పిటిషన్‌లో ఆరోపించాడు. ఇందుకు గానూ యాపిల్‌ తనకు 5 మిలియన్‌ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 53కోట్లు) చెల్లించాలని దావా వేశాడు. ఈ పిటిషన్‌పై స్థానిక కోర్టు త్వరలోనే విచారణ జరపనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని