Pakistan: వరద బాధితుల బస్సుకు మంటలు.. ప్రయాణికుల సజీవ దహనం..!

పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో దాదాపు 17 మంది సజీవదహనమయ్యారు.

Updated : 13 Oct 2022 10:35 IST

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సుకు మంటలు అంటుకోవడంతో దాదాపు 17 మంది సజీవదహనమయ్యారు. 10 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి కరాచీకి సమీపంలోని ఎం-9 మోటార్‌ వే వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ బస్సులో ప్రయాణికులంతా ఇటీవల పాక్‌ను ముంచెత్తిన వరద బాధితులు కావడం గమనార్హం. 

‘ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వరద బాధితులే. విపత్తు సమయంలో వారికి మోటార్‌ వే సమీపంలో ఆశ్రయం కల్పించారు. తిరిగి వారంతా తమ సొంత జిల్లా దాదుకు వెళుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. వెనక భాగంలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించడంతో.. 17 మంది సజీవదహనమయ్యారు. ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు బస్సు నుంచి దూకేశారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు’ అని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. 

ఇటీవల పాకిస్థాన్‌ భారీ వరదలతో విలవిల్లాడింది.  ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కురిసిన వర్షాలతో దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. అందులో సింధ్‌ ప్రావిన్స్‌లోని దాదూ జిల్లా కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. ఈ ఆగస్టులో కూడా పాక్‌లో పంజాబ్‌ రాష్ట్రంలో ఈ తరహా ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవదహనమయ్యారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని