South Korea: మూడుపదులు దాటినా పెళ్లికి దూరం.. రికార్డు స్థాయిలో పడిపోయిన వివాహాలు

జనాభా (Population) సంక్షోభాన్నిఎదుర్కొంటున్న దక్షిణ కొరియాలో (South Korea) వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెళ్లిళ్ల సంఖ్య (Marriages) గతేడాది రికార్డు స్థాయిలో పడిపోయినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 16 Mar 2023 18:11 IST

సియోల్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా (Population) భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాలు మాత్రం తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా, జపాన్‌లు సతమతమవుతుండగా.. దక్షిణ కొరియాకు (South Korea) సైతం ఇది పెను సవాలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ వివాహాల సంఖ్య గతేడాది రికార్డు స్థాయిలో పడిపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ప్రపంచంలోనే అతితక్కువ జననాల రేటున్న ద.కొరియాకు.. పౌరులు ఆలస్య వివాహాలు (Marriage) చేసుకోవడం/దూరంగా ఉండటం వంటివి మరింత కలవరపెడుతున్నాయి.

దక్షిణ కొరియా 1970 నుంచి దేశవ్యాప్తంగా వివాహాల నమోదును క్రమం తప్పకుండా నమోదు చేస్తోంది. గతేడాది దేశంలో 1,92,000 వివాహాలు జరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2012లో 3,27,000లతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ! దశాబ్ద కాలంతో పోలిస్తే వీటి సంఖ్య 40శాతం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా 1970 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయిలో వివాహాలు జరగడం కూడా ఇది తొలిసారి.

సరాసరి 33 ఏళ్లకు పెళ్లి..

దక్షిణ కొరియాలో యువతీ, యువకులు వివాహాలను ఆలస్యంగా చేసుకుంటున్నట్లు నివేదికలను బట్టి చూస్తే తెలుస్తోంది. అక్కడి పురుషులు తొలి వివాహ వయస్సు సరాసరి 33.7 ఏళ్లుగా నమోదైంది. అమ్మాయిలు కూడా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. మహిళల సరాసరి వివాహ వయసు 31.3గా ఉంది. గతేడాది జరిగిన లక్షా 90వేల వివాహాల్లో 80శాతం మంది మొదటిసారి పెళ్లి చేసుకున్నవాళ్లే.

భారీ ఖర్చు చేస్తున్నప్పటికీ..

కొన్ని దశాబ్దాలుగా దక్షిణ కొరియా జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం 5.2కోట్ల జనాభా ఉండగా.. 2067 నాటికి అది 3.9కోట్లకు పడిపోనున్నట్లు అంచనా. ఈ క్రమంలో జనాభా సంక్షోభాన్ని నివారించేందుకు దక్షిణకొరియా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా జననాల రేటు పెంచేందుకుగాను 2006 నుంచి సుమారు 213 బి.డాలర్లు (రూ.17లక్షల కోట్లు) ఖర్చు పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ద.కొరియాలో జీవన వ్యయంతోపాటు నివాస ఖర్చులు భారీగా పెరగడం అనేవి వివాహాలు తక్కువగా ఉండటం, జననాల రేటు క్షీణించేందుకు కారణాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలు చేసే మహిళలు తమ పిల్లల్ని చూసుకునేందుకు సరైన సమయం కేటాయించలేకపోవడమూ వారిపై ఒత్తిడికి కారణమవుతోందని చెబుతున్నారు. ఇలా భిన్న కారణాలతో అక్కడి యువతీ, యువకులు వివాహాలకు దూరంగా ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు