Lottery: రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి!

రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న తన భార్య.. ఈ విషయాన్ని దాచిపెట్టి మరో వివాహం చేసుకుందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాడో వ్యక్తి. థాయ్‌లాండ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

Published : 22 Mar 2023 02:22 IST

బ్యాంకాక్‌: రూ.2.9 కోట్ల విలువైన లాటరీ(Lottery) గెలుచుకున్న విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా, తన భార్య మరో పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసుకుని కంగుతిన్నాడో భర్త. దీంతో తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారం థాయ్‌లాండ్‌(Thailand)లో  వెలుగుచూసింది. నారిన్‌ అనే వ్యక్తికి 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమొత్తంలో అప్పులు ఉండటంతో.. సంపాదన కోసం భార్యాభర్తలు 2014లో దక్షిణ కొరియాకు వెళ్లారు. అయితే, కుమార్తెలను చూసుకునేందుకుగానూ ఆమె థాయ్‌లాండ్‌ తిరిగి వచ్చేశారు. అప్పటినుంచి అతను నెలకు రూ.70 వేలకుపైగా ఇంటికి పంపుతూ ఉన్నాడు.

అయితే, తన భార్య రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుందన్న విషయాన్ని తనకు చెప్పకుండా దాచిపెట్టిన విషయం  ఇటీవల తెలుసుకున్నాడు. ఫోన్‌ చేసినా ఎంతకూ స్పందన లేకపోవడంతో స్వదేశానికి వచ్చాడు. తీరా.. ఇక్కడికి వచ్చాక.. ఆమె ఓ పోలీసు అధికారిని పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసుకుని కంగుతిన్నాడు. ‘నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ఏం చేయాలో తెలియలేదు. మా 20 ఏళ్ల వైవాహిక బంధంలో ఆమె ఇలా చేస్తుందని ఏరోజూ ఊహించలేదు. నా బ్యాంకు ఖాతాలో ఇప్పుడు రూ.1.40 లక్షలు మాత్రమే ఉన్నాయి. న్యాయం కోసం ఆమెపై దావా వేశా’ అని అతడు వాపోయినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన  అధికారులు.. అసలు విషయం కనుక్కునే పనిలో పడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు