Mobile: ‘ఫోన్‌ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్‌ పితామహుడు

ప్రపంచ జనాభాతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెల్‌ఫోన్‌ల (Mobile) సంఖ్యే అధికం. ఇలా  దాదాపు ప్రతిఒక్కరి చేతిలో వాలిపోయిన సెల్‌ఫోన్‌ వాడకం తీరును చూసి దాని సృస్టికర్త మార్టిన్‌ కూపర్‌ (Martin Cooper)  విస్తుపోయారు. కొందరు మూర్ఖంగా వినియోగిస్తున్నారన్న ఆయన.. మరో తరం వచ్చే సరికి మార్పు వస్తుందన్నారు.

Published : 30 Mar 2023 15:57 IST

కాలిఫోర్నియా: ఆధునిక ప్రపంచంలో కనిపెట్టిన అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో మొబైల్‌ ఫోన్‌ (Mobile) ఒకటి. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో కేవలం సంభాషణల కోసం పరిమితమైన మొబైల్‌ ఫోన్‌.. ప్రస్తుతం ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తెచ్చుకుంది! సెల్‌ఫోన్‌ వాడకంపై చాలామందిలో నియంత్రణ లేమి, విచ్చలవిడితత్వం కనిపిస్తుంటుంది. అటువంటి సంఘటనలను చూసి ఏకంగా సెల్‌ఫోన్‌ కనిపెట్టిన ఇంజినీర్‌ విస్తుపోయాడట. సెల్‌ఫోన్‌ను విపరీతంగా చూస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఇంజినీర్‌, మొబైల్‌ సృష్టికర్త మార్టిన్‌ కూపర్‌ (Martin Cooper) తన మనోగతాన్ని వెల్లడించారు.

కమ్యూనికేషన్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన సెల్‌ఫోన్‌ను అమెరికాకు చెందిన మార్టిన్‌ కూపర్‌ (Martin Cooper) ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 1973 ఏప్రిల్‌ 3న తొలిసారి ఆ పరికరంతో సంభాషణ జరిపారు. ఆయనను ‘సెల్‌ఫోన్‌ పితామహుడు’ అని పిలుస్తుంటారు. మొబైల్‌ఫోన్‌ను తొలిసారి ఉపయోగించిన విధానం.. ప్రస్తుతం వాడుతున్న తీరుపై 94ఏళ్ల మార్టిన్‌ తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఎంతో చక్కగా కనిపిస్తోన్న ఈ పరికరం.. ఏదో ఒకరోజు వ్యాధులను జయించడానికి దోహదం చేస్తుందన్నారు. కానీ, ప్రస్తుతం మనకు అది కొంత నష్టాన్ని కలిగించవచ్చని అన్నారు.

‘ప్రతి ఒక్కరి జీవితంలో సెల్‌ఫోన్‌ భాగమైపోయింది. మేం ఊహించినట్లుగానే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్‌ చేరింది. ప్రపంచ జనాభా కంటే మొబైల్‌ ఫోన్ల సంఖ్యే ఎక్కువ. ఇది మా కలను కొంతవరకు సాకారం చేసినట్లే. భవిష్యత్తులో విద్యా, ఆరోగ్య వ్యవస్థల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఒకటి, రెండు తరాల్లో వ్యాధులను కూడా జయించే స్థాయికి ఇవి చేరతాయి’ అని మార్టిన్‌ కూపర్‌ పేర్కొన్నారు. ఇదే అంశంపై కొంతకాలం క్రితం మాట్లాడిన ఆయన.. ఏదో ఒకరోజు అవి (Cell Phone) మన చర్మంలో కలిసిపోయే పరికరాలుగా మారిపోతాయని అన్నారు.

‘ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ చూసుకుంటూ రోడ్డు దాటుతున్న ఘటనను చూసి నేను విస్తుపోయా. కార్లు ఢీకొన్న తర్వాత కొంతమందికి ఆ విషయం గుర్తొస్తుంది. అది వారి మూర్ఖత్వం. ప్రస్తుతం మనం నిత్యం మొబైల్‌ ఫోన్లను పట్టుకు వేలాడే దశలో ఉన్నాం. ఇది ఎంతోకాలం ఉండదు. ప్రతితరం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తుంది. సెల్‌ఫోన్‌ను అత్యంత మెరుగ్గా ఎలా ఉపయోగించాలో వారు నేర్చుకుంటారు. మానవులు త్వరలోనే ఈ విషయాన్ని గుర్తిస్తారు. లక్షల కొద్ది యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఉండటం కొంచెం ఎక్కువే అనిపిస్తుంటుంది. మనవళ్లు, మునిమనమలు వాడిన విధంగా నేను ఎప్పటికీ వాటిని అర్థం చేసుకోలేను’ అని ప్రజలు సెల్‌ఫోన్‌ వాడుతున్న తీరుపై మార్టిన్‌ కూపర్‌ నవ్వుతూ సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని