Sydney: సిడ్నీలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం

Fire Accident in sydney: సిడ్నీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ ఏడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల ధాటికి భవన శిథిలాలు రోడ్డుపై పడి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Updated : 25 May 2023 13:55 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా (Australia)లోని సిడ్నీ (Sydney) నగరంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. (Fire Accident in sydney)

స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సర్సీ హిల్స్‌లోని ఏడంతస్తుల భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత మూడో అంతస్తులో మొదలైన అగ్నికీలలు క్షణాల వ్యవధిలోనే భవనమంతా వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 100 అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.

అయితే, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి పక్కనున్న భవనాలకూ వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవనం ముందు పార్క్‌ చేసిన ఓ కారుతో పాటు పలు భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. మంటల ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కూలిపోతోందని తెలిపారు. ప్రమాదస్థలానికి కొద్ది దూరంలోనే సిడ్నీలోని అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషన్ ఉంది. కాగా.. అగ్నిప్రమాదం జరిగిన భవనం కొంతకాలంగా ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిరాశ్రయులు ఆ భవనంలో ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని