Sri Lanka Crisis: శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం..

తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభమూ ముదురుతోంది...

Updated : 10 Apr 2022 12:17 IST

కొలంబో: తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభమూ ముదురుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను డిమాండ్‌ చేస్తూ గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. శనివారం ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. నిన్న మధ్యాహ్నం అధ్యక్షుడి అధికారిక కార్యాలయం ముందుకు చేరుకున్న దాదాపు 10 వేల మంది నిరసనకారులు ఆదివారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉండడం గమనార్హం. 

రాత్రంతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి కదిలేది లేదని ఆందోళనకారులు భీష్మించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సైనిక బలగాలు అత్యంత అప్రమత్తతతో గస్తీ కాయాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం నుంచే అటుగా వెళ్లే రోడ్లన్నింటినీ నిరసనకారులు నిర్బంధించారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ‘మేమింకా ఇక్కడే ఉన్నాం’ అంటూ ఓ ఆందోళకారుడు సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘గో హోం గోటా (గొటబాయ ఇంటికి వెళ్లండి)’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడే రాత్రంగా ఉన్నట్లు ఓ ప్రత్యక్షసాక్షి తెలిపారు. విద్యుత్తు, గ్యాస్‌, ఇంధనం, ఔషధాలు లేనికారణంగానే ఈ ఆందోళనలు చేపట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. పాలకుల వద్ద ఎలాంటి పరిష్కారాలు లేవని.. వారి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

మార్చి 31న రాజపక్స వ్యక్తిగత నివాసం ముందు జరిగిన నిరసనల్ని పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. ఆందోళనకారులపైకి బాష్పవాయువు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. అప్పటి నుంచి నిరసనకారులు భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పార్లమెంటు సభ్యుల ఇళ్ల ఎదుట సైతం ఆందోళనలు ఉద్ధృతం చేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ప్రదర్శనలకు ప్రతిపక్షాలే కారణమని ఆరోపిస్తోంది. ముఖ్యంగా జనతా విక్తుముతి పెరముణ పార్టీయే ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శిస్తోంది. అధ్యక్షుడి రాజీనామా డిమాండ్‌ రాజ్యాంగా విరుద్ధమని చెప్పుకొస్తోంది. ప్రతిపక్షాలు దేశంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించింది.

మరోవైపు ఈ ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించినట్లు అంతర్గత వర్గాలు తెలిపారు. ఈ మేరకు సంకీర్ణ ప్రభుత్వంలోని దాదాపు 10 పార్టీల నేతలతో ఆదివారం అధ్యక్షుడు సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవెగయ మాత్రం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి తీరతామని తేల్చి చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని