Imran Khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ అరెస్టుకు యత్నం.. లాహోర్‌లో ఉద్రిక్తత

ఓ వైపు ఆర్థిక అస్థిరత ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌(pakistan)లో రాజకీయ అశాంతి చెలరేగే ప్రమాదం ఉంది. తాజాగా ఇమ్రాన్‌ (Imran Khan)అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండటంతో లాహోర్‌లో ఉద్రిక్తత నెలకొంది. 

Published : 05 Mar 2023 16:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ (pakistan)మాజీ ప్రధాని, తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకోవడం లాహోర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తోషాఖానా (కానుకల భాండాగారం) కేసుకు సంబంధించి అరెస్టు వారెంట్‌తో నేటి ఉదయం లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌ ప్రాంతంలోని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటి వద్దకు పోలీసులు చేరుకొన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి తరచూ ఇమ్రాన్‌ ఖాన్‌ గైర్హాజర్‌ కావడంతో ఇటీవల న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిల్‌ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు రావడంతో పీటీఐ అప్రమత్తమైంది. పార్టీ అభిమానులు తక్షణమే ఇమ్రాన్‌ గృహం వద్దకు చేరుకొని అరెస్టును అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. 

చట్టపరమైన అన్ని నిబంధనలు పూర్తి చేశాకే ఇమ్రాన్‌ అరెస్టు జరుగుతుందని పాక్‌కు చెందిన జియో టీవీ వెల్లడించింది. మరోవైపు పార్టీ ఉపాధ్యక్షుడు ఫవాద్‌ చౌధ్రీ వివాదాస్పదమైన ట్వీట్‌ చేశారు. ‘‘ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా పరిస్థితిని తీవ్రంగా దిగజారుస్తుంది. పాకిస్థాన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టవద్దని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. తెలివిగా ఆలోచించమని కోరుతున్నాను. పార్టీ కార్యకర్తలు జమాన్‌ పార్క్‌కు చేరుకోవాలి’’ అని ట్వీట్‌ చేశారు. 

ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన ఇటీవల జరిగిన విచారణకు ఇమ్రాన్‌ హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అతడిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. ఖాన్‌ను మార్చి 7వ తేదీ నాటికి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని