McDonald: ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. రష్యాను వీడనున్న మెక్‌డొనాల్డ్‌

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు కూడా రష్యాను వీడుతున్నాయి.

Published : 16 May 2022 23:56 IST

రష్యాలో కార్యకలాపాలు నిలిపివేస్తోన్న విదేశీ కంపెనీలు

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు కూడా రష్యాను వీడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా అంతర్జాతీయ ఫాస్ట్‌-ఫుడ్‌ దిగ్గజ సంస్థ మెక్‌డొనాల్డ్‌ కూడా రష్యాను వీడుతున్నట్లు ప్రకటించింది. తమ సంస్థ కార్యకలాపాలను స్థానిక కంపెనీకి విక్రయించనున్నట్లు తెలిపింది.

రష్యా వ్యాప్తంగా ఉన్న 850 రెస్టారెంట్లను మూసివేసినట్లు మెక్‌డొనాల్డ్‌ మార్చి నెలలో ప్రకటించింది. వాటిలో దాదాపు 62వేల మంది పనిచేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన మెక్‌డీ.. ఏకంగా తమ సంస్థ ఆపరేషన్స్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ కార్యకలాపాలను వేరొకరికి విక్రయిస్తున్నట్లు పేర్కొంది. దాదాపు 30ఏళ్లకు పైగా రష్యాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పిన మెక్‌డొనాల్డ్‌.. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభమే ఈ నిర్ణయానికి దారితీసిందని పేర్కొంది.

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నాయి. టెక్‌ దిగ్గజ సంస్థలతో సహా పలు రంగాలకు చెందిన కంపెనీలు ఇప్పటికే రష్యాను వీడాయి. ఇటీవల ఫ్రెంచ్‌ కంపెనీ రెనాల్ట్‌ ఏకంగా తన ఆస్తులను రష్యా ప్రభుత్వానికి అప్పజెప్పింది. ఇలా ఆయా సంస్థలు రష్యాను వీడడంతో సేవలతో పాటు భారీ స్థాయిలో రష్యా ఉద్యోగాలను కోల్పోతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని