King Charles: అప్పుడు క్వీన్‌ ఎలిజబెత్‌కు.. ఇప్పుడు కింగ్‌ ఛార్లెస్‌కి.. వెన్నంటే ఉంటూ..!

కింగ్‌ ఛార్లెస్‌-3కి (King Charles-3) బాడీ గార్డుగా ఉంటూ రక్షణ కల్పిస్తున్న ఓ గుబురు మీసాల వ్యక్తి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గతంలో క్వీన్‌ ఎలిజబెత్‌కు కూడా ఆయనే బాడీ గార్డుగా ఉండేవారు.

Published : 06 May 2023 17:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌లో (Britain) పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కింగ్‌ ఛార్లెస్‌-3 బ్రిటన్‌తో పాటు మరో 14 రాజ్యాలకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. క్వీన్‌ ఎలిజబెత్‌-2 గత ఏడాది సెప్టెంబరులో కన్నుమూసిన తర్వాత వేలాది మంది ప్రజలు, విదేశాలకు చెందిన అతిథుల నడుమ ఈ పట్టాభిషేకం కనులవిందుగా సాగింది. ఈ సందర్భంగా కింగ్‌ ఛార్లెస్‌ బాడీగార్డుపై మరోసారి ఇంటర్నెట్‌లో చర్చ మొదలైంది. గత ఏడాది కాలంగా ఛార్లెస్‌-3 ఎక్కడికి వెళ్లినా.. గుబురు మీసాలతో దృఢమైన శరీరం కలిగిన ఓ వ్యక్తి ఆయన వెన్నంటే ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు.

గతంలో తన తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌-2కి రక్షణ కల్పించిన సెక్యూరిటీ బృందాన్నే ప్రస్తుతం ఛార్లెస్‌-3 కూడా కొనసాగిస్తున్నారు. ఎలిజబెత్‌-2 అంత్యక్రియల సమయంలోనూ ఈ బాడీగార్డు అందరి దృష్టినీ ఆకర్షించారు. అంతేకాకుండా, గత ఏడాది కాలంలో కింగ్‌ ఛార్లెస్‌-3 పాల్గొన్న దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ వెన్నంటే ఉంటూ అనుక్షణం రక్షణగా నిలుస్తున్నారు. ఎవరైనా రాజు ఫొటోలను తీయాలనుకుంటే.. వెంటనే ఫోన్‌ను కిందకి దించాలని చెబుతూనే.. ఆయన్ను నేరుగా చూసి సంతోషించాలంటూ మృదువుగా చెప్పేవారు. ఒకసారి ఓ మహిళ కింగ్‌ ఛార్లెస్‌-3 వీడియోను తీస్తుండగా ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కొని, వీడియో తీయొద్దని వారించడం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అయ్యింది. 

అందరూ ఆ బాడీ గార్డును కింగ్స్‌మ్యాన్ సినిమాలోని బ్రిటన్‌-ఇటాలియన్‌ నటుడు కొలిన్‌ ఫిర్త్‌తో పోల్చుతున్నారు. అతడి నడుము వద్ద ఓ గొడుగులాంటి వస్తువు ఒకటి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అందులో తుపాకీ ఉంటుందని కొందరు చెబుతుంటారు. మరోవైపు ఆ బాడీగార్డు సీక్రెట్‌ సర్వీసు నుంచి వచ్చిన అధికారి అని కొందరు భావిస్తుండగా.. కొందరు మాత్రం కింగ్‌ ఛార్లెస్‌ కుటుంబం నియమించుకున్న ప్రైవేటు భద్రత అధికారి అని అంటారు. అతడు ఎవరైనప్పటికీ.. గతంలో క్వీన్‌ ఎలిజబెత్‌-2, ఆ తర్వాత కింగ్‌ ఛార్లెస్‌-3 కూడా ఆయన్ని రక్షణ అధికారిగా నియమించుకోవడం రాజకుటుంబీకులకు అతడిపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని