Melinda Gates: బిల్‌గేట్స్‌తో విడాకుల తర్వాత ఎన్నో రోజులు ఏడ్చా..: మిలిందా గేట్స్‌

దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు

Published : 05 Mar 2022 02:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడాకులు తీసుకున్నారు బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోడవడం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ పరిణామాల తర్వాత తాను ఎన్నో రోజులు బాధపడ్డానని, నేలపై పడుకుని ఏడ్చేశానని మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ తెలిపారు. అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె విడాకుల గురించి తొలిసారిగా స్పందించారు. తన వైవాహిక జీవితంలో ఎదురైన క్లిష్టపరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. 

‘‘నా జీవితంలో మరో మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం వచ్చింది.  మేం విడిపోతున్నట్లు ప్రకటిస్తే చాలా మంది ఆశ్చర్యానికి గురవుతారని ముందే ఊహించాం. కానీ, ప్రపంచమంతా చర్చించుకునేంత పెద్ద న్యూస్‌ అవుతుందని నేను ఊహించలేదు. విడాకులతో నేను ఎంతగానో కుంగిపోయా. చాలా రోజుల పాటు బాధపడ్డా. నేలపై కూర్చుని ఏడుస్తూనే ఉన్నా. ఇలా ఎలా జరిగింది? ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి? జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? ఇలా ఆలోచిస్తూనే ఉండిపోయా. కొన్నిసార్లయితే విపరీతమైన కోపం వచ్చేది. ఇది నిజంగా చాలా బాధాకరమైన పరిణామం. అయితే ఆ కుంగుబాటు నుంచి క్రమక్రమంగా కోలుకోవడం మొదలుపెట్టా. నా జీవితంలో మరో పేజీని ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని భావించా’’ అని మిలిందా గేట్స్‌ చెప్పుకొచ్చారు.

బిల్‌గేట్స్‌ అతడిని కలవడం నచ్చలేదు..

ఈ సందర్భంగా లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గేట్స్‌ సంబంధాల గురించి కూడా మెలిందా స్పందించారు. ‘‘జెఫ్రీని కలవడం నాకు నచ్చలేదని నేను ముందే స్పష్టంగా చెప్పా. ఆ మనిషి ఎవరో చూడాలని ఒకరోజు జెఫ్రీని కలిశా. కానీ అతడిని కలిసినందుకు పశ్చాత్తాపపడ్డా. అతడు ఎంతో అసహ్యకరమైన వ్యక్తి. చెడు వ్యక్తిత్వం కలవాడు’’ అని మిలిందా తెలిపారు. 

జెఫ్రీతో సంబంధాలు.. విడాకులు తీసుకోడానికి కారణమా అని ప్రశ్నించగా ‘‘ఇదొకటనే కాదు.. చాలా కారణాలున్నాయి’’ అని సమాధానమిచ్చారు. ఇక, బిల్‌ గేట్స్‌కు మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగితో లైంగిక సంబంధం గురించి ప్రశ్నించగా.. ఇవన్నీ ఆయన్నే(బిల్‌ గేట్స్‌) అడగాలని అన్నారు. అయితే ‘గేట్స్‌ ఫౌండేషన్‌’ కోసం తాను ఇంకా బిల్‌ గేట్స్‌తో స్నేహపూర్వకంగా కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. 

1994లో బిల్‌గేట్స్‌, మెలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకున్న ఈ జంట.. విడిపోతున్నట్లు మే 3న సంయుక్త ప్రకటన చేసింది. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని బిల్ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పినట్లు గతంలో వాల్‌స్ట్రీట్‌ కథనం పేర్కొంది. 2013లో ఓ దాతృత్వ కార్యక్రమం కోసం గేట్స్‌ దంపతులు ఎప్‌స్టీన్‌ను కలిశారు. అయితే అతడి ప్రవర్తనతో తాను సౌకర్యంగా లేనని మెలిందా అప్పుడే గేట్స్‌కు చెప్పారు. కానీ ఆమె ఆందోళనను విస్మరించి గేట్స్‌, కంపెనీ ఉద్యోగులు కొందరు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు కొనసాగించారు.

వృత్తిపరంగా ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌ బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతుండగానే అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనారోగ్యంతో మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని