Melinda Gates: ‘ఇప్పుడు జీవితం ఆనందంగా ఉంది’.. బిల్‌ గేట్స్‌తో విడాకులపై మెలిందా

Melinda Gates: బిల్‌గేట్స్‌, మెలిందా గేట్స్‌ 2021లో విడాకులు తీసుకున్నారు. దీనిపై ఆమె పలు ప్రైవేట్‌ సందర్భాల్లో మాట్లాడినప్పటికీ.. బహిరంగంగా మాత్రం ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

Published : 20 Jun 2024 08:24 IST

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌తో (Bill Gates) విడాకులు తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ అన్నారు. విడాకులకు ముందే ఆయనతో చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. 2021లో వారిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత దీనిపై ఆమె బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి.

పిల్లల సంరక్షణ సహా ఇతర బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూ విడాకుల వంటి బరువైన అంశాన్ని సమర్థంగా దాటగలిగానని మెలిందా తెలిపారు. విడాకులను తన జీవితంలో చోటుచేసుకున్న ‘బాధాకరమైన విషయం’గా అభివర్ణించారు. అయితే, ఆ తర్వాత మాత్రం తన జీవితం అద్భుతంగా సాగుతోందని చెప్పారు. చిన్న చిన్న పనులను సైతం తానే స్వయంగా చేసుకుంటున్నానని తెలిపారు. నిత్యావసర సరకులు, ఔషధాల కోసం స్టోర్లకు వెళ్లడం, నచ్చినప్పుడు రెస్టారెంట్లో తినడం.. ఇలా చిన్న చిన్న అంశాలతో జీవితం ఆనందంగా ఉందన్నారు.

విడాకుల సమయంలో తన మనసు మూడు ఆలోచనలతో నిండిపోయిందని మెలిందా వెల్లడించారు. జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? పిల్లల పరిస్థితేంటి? ఫౌండేషన్‌ బాగోగులెలా? ఇవే తనను తీవ్రంగా ఆలోచింపజేశాయన్నారు. ఈ మూడు ఒకదానితో ఒకటి ముడి వేసుకున్న అంశాలని తెలిపారు. ఎట్టకేలకు అవన్నీ సాఫీగా సద్దుమణిగాయని చెప్పారు.

దాతృత్వ కార్యక్రమాల కోసం స్థాపించిన ఫౌండేషన్‌ నుంచి విడాకుల తర్వాత మెలిందా దూరం జరిగారు. అనంతరం ఆమె తన సొంతంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నారు. మహిళల హక్కులు, వారి ఆర్థిక స్వావలంబన కోసం ఇటీవలే ఆమె బిలియన్‌ డాలర్ల ఫండ్‌ను ప్రకటించారు.

1994లో బిల్‌గేట్స్‌, మెలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. వివిధ కారణాల వల్ల 2021లో విడాకులు తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విబేధాలు వచ్చాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత నుంచి దంపతుల మధ్య ఏర్పడిన దూరం చివరకు విడాకులకు దారితీసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనంలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని