Melinda French Gates: ‘ఈసారి నేను మౌనంగా ఉండలేను..’: మిలిందా గేట్స్‌ ఆసక్తికర పోస్ట్‌

Melinda French Gates: అమెరికా ఎన్నికలపై ఈసారి తాను మౌనంగా ఉండలేనని అంటున్నారు మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌. ఈ ఎన్నికల్లో తన ఓటు ఎవరికో బయటపెట్టారు.

Published : 21 Jun 2024 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని నెలల్లో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు (US Presidential Elections) జరగనున్నాయి. అధ్యక్ష పీఠం కోసం తలపడుతున్న జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య గట్టి పోటీ ఉంది. ఈ ఎన్నికలపై ప్రముఖ దాత, బిల్‌గేట్స్‌ మాజీ భార్య మిలిందా గేట్స్‌ (Melinda French Gates) ఆసక్తికర పోస్ట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కే అని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓ నేతకు ఆమె బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి.

‘‘ఇంతకుముందెన్నడూ నేను అధ్యక్ష అభ్యర్థికి ఇలా మద్దతు ప్రకటించలేదు. కానీ ఈసారి ఎన్నికలు మహిళలు, కుటుంబాలకు చాలా కీలకమైనవి. అందుకే, నేను మౌనంగా ఉండలేను. మహిళల భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక శక్తి, వ్యక్తిగత హక్కులను కాపాడే నాయకుడు కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలు పూర్తిగా భాగస్వాములయ్యే స్వేచ్ఛను కల్పించాలి. ఈసారి నా ఓటు అధ్యక్షుడు బైడెన్‌కే’’ అని మిలిందా (Melinda French Gates) తన ఎక్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

‘ఇప్పుడు జీవితం ఆనందంగా ఉంది’.. బిల్‌ గేట్స్‌తో విడాకులపై మెలిందా

ఈసందర్భంగా ట్రంప్‌ (Donald Trump)పై ఆమె విమర్శలు గుప్పించారు. గతంలో అతని హయాంలో మహిళల ఆరోగ్యం, భద్రత, స్వేచ్ఛను ఆయన ప్రమాదంలో పడేశారని విమర్శించారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ‘ది బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ 1.8 మిలియన్‌ డాలర్ల విరాళాలు అందించింది. ఇందులో ఎక్కువ భాగం డెమోక్రాట్లకే వెళ్లినట్లు తెలిసింది.

2021లో బిల్‌గేట్స్‌ నుంచి విడాకులు తీసుకున్న మిలిందా.. ఇటీవల దాతృత్వ కార్యక్రమాల కోసం స్థాపించిన గేట్స్‌ ఫౌండేషన్‌ నుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె తన సొంతంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నారు. మహిళల హక్కులు, వారి ఆర్థిక స్వావలంబన కోసం ఇటీవలే ఆమె బిలియన్‌ డాలర్ల ఫండ్‌ను ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని