Mumbai terror attacks: 2008 ఉగ్రదాడి గాయం గుర్తులు ఇంకా మానిపోలేదు: అమెరికా

ముంబయి ఉగ్రదాడి జ్ఞాపకాలు ఇంకా అమెరికా, భారత్‌ను వెంటాడుతున్నాయని శ్వేతసౌధం ప్రతినిధి వ్యాఖ్యానించారు. 

Updated : 24 Mar 2023 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి(Mumbai)లో 2008లో జరిగిన ఉగ్రదాడు(Mumbai terror attacks)ల్లో గాయాలను భారత్‌, అమెరికా ఇంకా మర్చిపోలేదని అమెరికా పేర్కొంది. విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ రోజువారీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజువారీ విలేకర్ల సమావేశంలో ఒకరు పాక్‌కు సాయంపై నెడ్‌ప్రైస్‌ను ప్రశ్నించారు. ‘‘2008 ఉగ్రదాడులు (Mumbai terror attacks)జరిగి 14ఏళ్లు అయింది.. దీనిలో ఆరుగురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. . ఇటీవల ఫారెన్‌ రిలేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌ మైఖేల్‌ మెక్‌కౌల్‌ ఇటీవల యూఎస్‌ఎయిడ్‌ నిర్వాహకురాలు సమంతా పవార్‌కు లేఖ రాశారు. హెల్పింగ్‌ హ్యాండ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ (హెచ్‌హెచ్‌ఆర్‌డీ)కి నిధులు అందించవద్దని కోరారు. ఈ సంస్థకు లష్కరే తొయిబా సహా పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఉగ్ర గ్రూపులకు సంబంధం ఉందని పేర్కొన్నారు. ఆ లేఖ గురించి.. ఉగ్రదాడిలో మరణించిన అమెరికా పౌరుల విషయంలో మీరు ఏం చెబుతారు’’ అని విలేకరి ప్రశ్నించారు. 

‘‘2008 ముంబయిలోని ఉగ్రదాడుల(Mumbai terror attacks) గాయం తాలుకా గుర్తులు భారత్‌, అమెరికాల్లో ఇంకా మానిపోలేదు. హోటల్‌పై దాడి, రక్తపాతం.. ఆ నాటి భయంకర చిత్రాలు ఇంకా గుర్తుకు వస్తుంటాయి. అందుకే అమెరికా ఆ దాడికి కారణమైన వ్యక్తులే కాదు.. వీరి వెనుక ఉగ్ర సంస్థలలను ఇప్పటికీ బాధ్యత వహించేలా ఒత్తిడి చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నాటి ఉగ్రదాడిలో మొత్తం 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. 300 మంది గాయపడ్డారు. ఈ దాడిలో మొత్తం పది మంది పాకిస్థాన్‌ ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో తొమ్మిది మందిని మట్టుపెట్టగా.. కసబ్‌ అనే ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొన్నారు. ఆ తర్వాత 2012లో అతడికి ఉరిశిక్షను అమలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు