Menthol: మెంథాల్‌తో అల్జీమర్స్‌ నుంచి ఉపశమనం!

మెంథాల్‌ వాసన చూడటం ద్వారా అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందే వీలుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇది రుజువైందని వారు తెలిపారు.

Published : 18 Jun 2024 04:54 IST

ఎలుకల్లో పరిశోధనలు విజయవంతం

ఎడిన్‌బరో: మెంథాల్‌ వాసన చూడటం ద్వారా అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందే వీలుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇది రుజువైందని వారు తెలిపారు. అనూహ్యంగా వెలుగు చూసిన ఈ అంశం.. ఈ వ్యాధికి కొత్త చికిత్స మార్గాన్ని చూపొచ్చని పేర్కొన్నారు. 

అల్జీమర్స్‌ అనేది చాలా తీవ్రమైన నాడీ క్షీణత వ్యాధి. కాలం గడిచేకొద్దీ అది మరింత తీవ్రరూపం దాల్చొచ్చు. ఈ వ్యాధి బాధితుల మెదడులో మార్పులు వస్తాయి. ఫలితంగా నాడీ కణాలు, వాటి మధ్య సంధానతలు బలహీనపడతాయి. బాధితుల్లో అనేక లక్షణాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైంది.. జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణించడం. అలాగే ఆలోచనశక్తి, సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతాయి. తరచూ భావోద్వేగాల్లో మార్పులు వస్తుంటాయి. ఫలితంగా.. బాధితుల్లో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. రోజువారీ పనులనూ చేసుకోలేకపోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులను గుర్తుపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్లమంది అల్జీమర్స్, తీవ్ర మతిమరుపు కలిగించే ఇతర రుగ్మతలతో బాధపడుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అల్జీమర్స్‌కు చికిత్స చేసే లేదా వ్యాధిని నెమ్మదింపచేసే ఔషధాల రూపకల్పనకు పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతమున్న చికిత్స విధానాలు వ్యాధి లక్షణాలను కొద్దిగా అదుపులో ఉంచడానికే ఉపయోగపడుతున్నాయి. 

తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు.. ఆల్‌ఫ్యాక్టరీ, ఇమ్యూన్, కేంద్ర నాడీ వ్యవస్థల మధ్య చర్యలు ఎలా ఉంటాయన్నది పరిశీలించారు. మెంథాల్‌ వాసనను పదేపదే చూపితే ఎలుకల్లో రోగనిరోధక ప్రతిస్పందన పెరిగినట్లు మునుపటి అధ్యయనంలో తేలింది. విషయగ్రహణ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచే సామర్థ్యం ఈ పదార్థానికి ఉందా అన్నది తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందుకోసం అల్జీమర్స్‌ లక్షణాలు కలిగి ఉన్న ఎలుకలను జన్యుమార్పిడి పద్ధతిలో రూపొందించారు. ఆరు నెలల పాటు వాటికి తరచూ మెంథాల్‌ వాసన చూపారు. అనంతరం ఈ జీవుల్లో రోగ నిరోధక ప్రతిస్పందన, విషయగ్రహణ సామర్థ్యాన్ని పరిశీలించారు. అల్జీమర్స్‌ కలిగిన ఎలుకలు.. ఆశ్చర్యకరంగా గణనీయ స్థాయిలో ఉపశమనం పొందినట్లు వెల్లడైంది. రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో మెంథాల్‌ సాయపడింది. అలాగే విషయగ్రహణ సామర్థ్యం క్షీణించకుండా నివారించింది. జ్ఞాపకశక్తి, అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరిచింది. 

అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్థుల్లో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలతో ముడిపడిన ఇంటర్‌లూకిన్‌-1 బీటా అనే ప్రొటీన్‌ పరిమాణాన్ని మెంథాల్‌ తగ్గించినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ప్రొటీన్‌ లేదా సైటోకైన్‌.. మెదడులో ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తుంది. ఫలితంగా విషయగ్రహణ సామర్థ్యానికి హాని కలుగుతుంది. ఇంటర్‌లూకిన్‌-1 బీటాను తగ్గించడం వల్ల ఈ ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, విషయగ్రహణ సామర్థ్య క్షీణతకు అడ్డుకట్ట పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని