MV Chem Pluto: ఎంవీ కెమ్‌ ప్లూటో వాణిజ్య నౌకపై డ్రోన్‌ దాడి నిజమే: భారత నేవీ

అరేబియా సముద్రంలో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌకపై డ్రోన్‌ దాడి నిజమేనని భారత నేవీ అధికారులు నిర్థారించారు. ఆ నౌకను ‘ఐసీఏఎస్‌ విక్రమ్‌’ రక్షణలో ముంబయి పోర్టుకు తీసుకొచ్చారు. 

Updated : 26 Dec 2023 00:34 IST

దిల్లీ: గుజరాత్‌ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో ప్రయాణిస్తోన్న ఓ వాణిజ్య నౌక (Merchant Ship) డిసెంబర్‌23న డ్రోన్‌ దాడి (drone attack)కి గురై నడి సంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత నౌకాదళం (Indian Navy) నిర్థారించింది. భారత తీర ప్రాంతానికి 400 కి.మీ దూరంలో ఎంవీ కెమ్‌ ప్లూటో అనే వాణిజ్య నౌకపై డ్రోన్‌ జరిగిందని పేర్కొంది. నౌకలోని సిబ్బంది మొత్తం క్షేమంగా ఉన్నారని తెలిపింది. డ్రోన్‌ దాడిలో నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్‌ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నౌక పాక్షికంగా దెబ్బతినగా.. 20 మంది భారతీయులతోపాటు మొత్తం 21 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నేవీదళం వెంటనే ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. సోమవారం ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ రక్షణలో ఆ వాణిజ్య నౌక ముంబయి పోర్ట్‌ ప్రాంతానికి చేరుకుంది. పోర్టుకు రాగానే భద్రతా దళాలు నౌకను క్షుణ్ణంగా పరిశీలించారు. దాడి జరిగిన చోటు, నౌక శకలాలను గుర్తించారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫొరెన్సిక్‌ పరీక్షలకు , సాంకేతిక విశ్లేషణకు పంపిస్తామని నౌకాదళ అధికారులు తెలిపారు. 

ఈ దాడి ఇరాన్‌ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్‌ వెల్లడించింది. అయితే, అమెరికా ఆరోపణను ఇరాన్‌ ఖండించింది. ‘‘దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సాయంపై నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తుంటారు’’ అని ఇరాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నాసిర్‌ కనానీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు