Meta: అమెరికా ప్రభుత్వానికి మెటా హెచ్చరిక..!

ఫేస్‌బుక్‌(Facebook)లో షేర్‌ చేసే వార్తలకు చెల్లించాల్సిన ఫీజు విషయంలో మెటా(Meta), అమెరికా(USA) ప్రభుత్వం మధ్య వివాదం భగ్గుమంది. అవసరమైతే తాము అమెరికా వార్తలను తొలగిస్తామని మెటా హెచ్చరికలు జారీ చేసింది.

Published : 06 Dec 2022 13:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌(Facebook), ఇన్‌స్టా(Instagram), వాట్సాప్‌(whatsapp)ల మాతృసంస్థ మెటా(Meta) ఓ చట్టం విషయంలో అమెరికా(USA) ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ చట్టం అమల్లోకి వస్తే అక్కడి మీడియా సంస్థలు ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసే కంటెంట్‌ ఫీజు విషయంలో బలంగా బేరమాడే అవకాశం లభిస్తుంది. ఈనేపథ్యంలో తాము వార్తా సంస్థలకు ట్రాఫిక్‌ పెంచేందుకు సహకరిస్తున్నామని మెటా చెబుతోంది. ఫేస్‌బుక్‌లో కంటెంట్‌ పోస్టు చేయడం వాటి ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది.

గతంలో ఇలాంటి చట్టాన్ని ఆస్ట్రేలియా(Australia) కూడా ప్రవేశపెట్టింది. అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా సంస్థల వార్తలను ఫేస్‌బుక్‌ కొన్నాళ్లు సస్పెండ్‌ చేసింది. తాజాగా ఇటువంటి చట్టాన్నే అమెరికాలో పరిశీలిస్తున్నారు. దీనిని జేసీపీఏ (ది జర్నలిజం కాంపిటీషన్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌ యాక్ట్‌) పేరిట మిన్నెసోటా సెనెటర్‌ యామీ క్లోబౌషెర్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అన్ని విభాగాల నుంచి మద్దతు లభించింది. సోషల్‌ మీడియా సంస్థలను ఫీజు విషయంలో సమష్టిగా డిమాండ్‌ చేయడానికి ఈ చట్టం వార్తా సంస్థలకు అవకాశం కల్పిస్తుంది.

సోషల్‌ మీడియా సంస్థలకు వచ్చే వాణిజ్య ప్రకటనల ఆదాయంలో వార్తా సంస్థలు భారీ వాటా కోరే అవకాశం ఉంది. ఇప్పటికే వార్తల నుంచి ఫేస్‌బుక్ భారీ ఎత్తున ఆదాయాన్ని పొందుతోందని మీడియా కంపెనీలు ఆరోపిస్తున్నాయి. కరోనా(Covid19) సమయంలో వార్తా సంస్థలు ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే.. మెటా(Meta) మాత్రం భారీగా ఆర్జించింది. మరోవైపు  మెటా వాదనలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే వార్తా సంస్థల వీక్షకుల సంఖ్యను తాము గణనీయంగా పెంచుతున్నట్లు చెబుతోంది.

మెటా ప్రతినిధి ఆండీ స్టోన్‌ మాట్లాడుతూ ‘‘జాతీయ భద్రతా చట్టంలో భాగంగా.. అసమగ్రంగా పరిశీలించిన జర్నలిజం బిల్లును కాంగ్రెస్‌ ఆమెదిస్తే గనుక.. మా వేదికపై నుంచి అమెరికాకు సంబంధించిన వార్తలను తొలగించే విషయాన్ని పరిశీలించాల్సి వస్తుంది’’ అని హెచ్చరించింది. ఫేస్‌బుక్‌లో మొత్తం షేర్‌ చేసే వార్తల నుంచి లభించే ఆదాయం అతి స్వల్పమని మెటా వెల్లడించింది. తాజాగా అమెరికాలో పెద్ద టెక్‌ కంపెనీల ఆధిపత్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న చాలా చట్టాల్లో ఇది కూడా ఒకటి. అమెరికన్‌ ఎకనామిక్‌ లిబర్టీస్‌ ప్రాజెక్టు పరిశోధకుడు మాట్‌  స్టోలర్‌ స్పందిస్తూ.. మీడియా సంస్థలను మెటా సజీవంగానే తినేస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘ ఏకఛత్రాధిపత్యం ప్రజాస్వామ్యాలకు ఎంత ప్రమాదకరమో.. అమెరికా కాంగ్రెస్‌ను బెదిరించేందుకు మెటా చేస్తున్న యత్నాలు తెలియజేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు