‘అంతరిక్ష ప్రయాణమా.. అది నీకోసం కాదన్నారు..!’

‘‘అంతరిక్షంలోకి వెళ్తావా.. ఆ కలలు మానుకో.. అది నీకోసం కాదు’’.. తన చిన్నతనం నుంచి ఈ మాటలే వింటోంది 26ఏళ్ల కాట్యా ఎచాజరెటా. ఇంట్లో వాళ్లు, స్నేహితులు, టీచర్లు ఇలా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ

Published : 05 Jun 2022 02:28 IST

వివక్షను దాటుకుని.. నింగిలోకి దూసుకెళ్తోన్న కాట్యా

అట్లాంటా: ‘‘అంతరిక్షంలోకి వెళ్తావా.. ఆ కలలు మానుకో.. అది నీకోసం కాదు’’.. తన చిన్నతనం నుంచి ఈ మాటలే వింటోంది 26ఏళ్ల కాట్యా ఎచాజరెటా (Katya Echazarreta). ఇంట్లో వాళ్లు, స్నేహితులు, టీచర్లు ఇలా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెను నిరుత్సాహపరిచేవారే. కానీ, ఆమె ఎన్నడూ అధైర్యపడలేదు. తన ఆశ, ఆశయం దిశగానే అడుగులు వేసింది. తన వల్ల కాదు అన్నవారి మాటల్ని తప్పని రుజువు చేస్తూ.. నేడు అంతరిక్ష యానానికి సిద్ధమైంది.

మెక్సికోలోని జలిస్కో ప్రాంతంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో కాట్యా (Katya Echazarreta) జన్మించింది. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. అయితే వలసదారుల ప్రక్రియ కారణంగా కాట్యా ఐదు సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కాట్యాకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం (Space), సైన్స్‌ అంటే విపరీతమైన ఆసక్తి. ఆ ఇష్టంతోనే ఎలక్ట్రిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి నాసాలో జెట్‌ ప్రొపెల్షన్‌ లేబొరేటరీలో చేరింది. అక్కడ అనేక స్పేస్‌ మిషన్లలో పనిచేసింది. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి జాన్స్‌ హాక్పిన్స్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రిక్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌లో చేరింది.

వివక్షను ఎదుర్కొని..

కాట్యాకు అంతరిక్ష యానం చేయాలని ఎంతో కోరిక. కానీ, దాన్ని బయటకు చెప్పాలంటే అందరూ నవ్వుతారేమోనని భయం. ఎందుకంటే, మెక్సికో నుంచి వచ్చిన మొదట్లో తన దేశం గురించి తెలిసి చాలా మంది అవహేళన చేశారట. ‘అమ్మాయిలు అంతరిక్షానికా’ అని ఎగతాళి కూడా చేశారట. అవన్నీ భరించి ఎలక్ట్రిక్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కాట్యా.. నాసాలో చేరి అంతరిక్ష ప్రయోగాలపై అనుభవం సంపాదించింది. నాసాలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆమెను వివక్షను ఎదుర్కొంది. కానీ ఎన్నడూ నిరుత్సాహపడలేదు.

2019లో జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ (Blue Origin) సంస్థ అంతరిక్ష పర్యాటకానికి సన్నాహాలు చేస్తోందని తెలిసి.. స్పేస్‌ ఫర్ హ్యుమానిటీ అనే నాన్ ప్రాఫిట్‌ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకుంది. అంతరిక్ష యానం కోసం 100 దేశాల నుంచి 7వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. అందులో నుంచి కాట్యా ఎంపికైంది. ఆ విషయం తెలియగానే ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘‘సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో మహిళలు రాణించకపోవడానికి ప్రధాన కారణం.. అమ్మాయిల పట్ల చూపే వివక్ష, ప్రతికూలతలే. వాటిని నేను మార్చాలనుకుంటున్నా’’ అని కాట్యా గర్వంగా చెబుతోంది.

10 నిమిషాల పాటు అంతరిక్షంలో..

కాట్యా, మరో ఐదుగురితో కలిసి శనివారం బ్లూ ఆరిజిన్‌ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. వీరంతా అంతరిక్షం కొనకు వెళ్లి అక్కడ 10 నిమిషాల పాటు ఉండి తిరిగి భూమికి చేరుకోనున్నారు. మూడు నిమిషాల పాటు గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఉండనున్నారు. మరో మూడు నిమిషాల పాటు భూమి అద్భుత దృశ్యాలను చూడనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వీరికి సిమ్యులేటర్లలో శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ప్రయాణంతో అంతరిక్ష యానం చేసిన మొదటి మెక్సికో యువతిగా కాట్యా సరికొత్త గుర్తింపు సాధించనుంది. అంతేగాక, రోదసిలోకి వెళ్లనున్న అత్యంత పిన్న వయస్కులైన మహిళల్లో ఒకరిగా నిలవనుంది. స్పేస్‌ఎక్స్‌, వర్జిన్‌ గెలాటిక్‌కు పోటీగా బ్లూ ఆరిజిన్‌ కూడా అంతరిక్ష పర్యాటకంలోకి అడుగుపెట్టింది. సాధారణ పౌరులను అంతరిక్షంలోకి తీసుకెళ్తోంది. స్పేస్‌ టూరిజంలో బ్లూ ఆరిజన్‌ చేపడుతోన్న ఐదో మిషన్‌ ఇది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని