Monkeypox: పాకుతూనే ఉన్న మంకీపాక్స్‌.. మరో రెండు దేశాల్లో గుర్తింపు

మెక్సికో, ఐర్లాండ్‌ దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్‌ గుర్తించినట్లు మెక్సికో వైద్యాధికారులు......

Published : 30 May 2022 02:29 IST

మెక్సికో సిటీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్న వేళ.. మంకీపాక్స్‌ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో మొదలై ఒక్కో దేశానికి పాకుతోంది. ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా మెక్సికో, ఐర్లాండ్‌ దేశాల్లోనూ తొలి కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్‌ గుర్తించినట్లు మెక్సికో వైద్యాధికారులు వెల్లడించారు. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సదరు వ్యక్తి అమెరికా నుంచి నెదర్లాండ్‌ మీదుగా తమ దేశానికి వచ్చాడని, అతడు ఎక్కడ ఈ వ్యాధి బారిన పడ్డాడో తెలుసుకుంటామని పేర్కొన్నారు.

ఐర్లాండ్‌లో మంకీపాక్స్ తొలి కేసును ధ్రువీకరించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లక్షణాలున్న మరో వ్యక్తిని కూడా పరీక్షిస్తున్నట్లు హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే.. మంకీపాక్స్‌కు అంతలా భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కరోనా తరహాలో వ్యాపించనుందా? అనే అనుమానాలకు తెరదించుతూ.. అలాంటి ఛాన్సేలేదని వెల్లడిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్‌ మాట్లాడుతూ..‘మంకీపాక్స్‌ అనేది కొవిడ్‌ తరహాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ కాదు. దాని గురించి ప్రపంచానికి దశాబ్దాల కాలంగా తెలుసు. అంత ప్రమాదకారి కాదు. మశూచి మాదిరి మంకీపాక్స్‌ కూడా ఆ కుటుంబానికి చెందినదే’ అని తెలిపారు. కరోనా తరహాలో ప్రమాదకారి కాదని, ఆందోళన వద్దని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని