Michelle Obama: ఆ రోజు ఏడుస్తూనే ఉన్నాను..: మిచెల్‌

అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా(Michelle Obama) శ్వేతసౌధంతో ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. దానిని వీడుతుంటే తీవ్ర ఉద్వేగం కలిగిందన్నారు. 

Published : 08 Mar 2023 11:19 IST


వాషింగ్టన్‌: అమెరికా(America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. శ్వేతసౌధాన్ని వీడేముందు తట్టుకోలేకపోయానని మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా(Michelle Obama) వెల్లడించారు. అరగంటపాటు ఏడుస్తూనే ఉన్నానని, ఉద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయానని అన్నారు.

‘ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత.. నాలో ఎన్నో భావాలు కలిగాయి. తీవ్ర ఉద్వేగానికి గురయ్యాను. ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఇంటిని మేం వీడుతున్నాం. నా పిల్లలకు శ్వేతసౌధంతో అనుబంధం ఎక్కువ. వారికి చికాగో గుర్తుంది. కానీ.. నా పిల్లలు ఎదిగింది ఇక్కడే. వారిని పెంచడంలో ఇక్కడి సిబ్బంది ఎంతో సహకరించారు. దాంతో ఆ ఇంటితో మా బంధం పెనవేసుకుపోయింది’ అని ఆనాటి అనుభవాలను మిచెల్‌(Michelle Obama) ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

‘ఆ కార్యక్రమం తర్వాత మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ఎక్కాం. విమానం తలుపులు మూయగానే.. నన్ను నేను నియంత్రించుకోలేకపోయా. 30 నిమిషాలు దుఃఖాన్ని నియంత్రించుకోలేకపోయా. ఎనిమిదేళ్లు మా జీవితంలో ముడిపడి ఉన్న ఆ ప్రాంతాన్ని వీడుతుండటమే నా పరిస్థితికి కారణం’ అని తెలిపారు. అలాగే ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎక్కడా ఎలాంటి భిన్నత్వం కనిపించలేదని, అమెరికాకున్న విశాల దృక్పథం ప్రతిబింబించలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని