Bill Gates: కరోనా తర్వాత మరో మహమ్మారి.. హెచ్చరించిన బిల్‌ గేట్స్‌..!

కరోనా మహమ్మారి ఉద్ధృతి నుంచి యావత్‌ ప్రపంచం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. త్వరలోనే కొవిడ్‌ ఎండెమిక్‌ దశకు చేరుకోవచ్చన్న నిపుణుల అంచనాలు కాస్త ఊరట

Published : 21 Feb 2022 11:01 IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ఉద్ధృతి నుంచి యావత్‌ ప్రపంచం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. త్వరలోనే కొవిడ్‌ ఎండెమిక్‌ దశకు చేరుకోవచ్చన్న నిపుణుల అంచనాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశముందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ హెచ్చరించారు. అయితే కొత్త మహమ్మారి కరోనా వైరస్‌ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్‌ల నుంచి వచ్చే అవకాశముందని తెలిపారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఇటీవల వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే చాలా మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరగడంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తట్టుకోగలిగాం. అయితే కొవిడ్‌ తగ్గుతున్నప్పటికీ.. ప్రపంచంపై మరో మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది బహుశా.. కరోనా కుటుంబం నుంచి గాక, వేరే వైరస్‌ నుంచి కావొచ్చు. వృద్ధులు, ఒబెసిటీ, డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు’’ అని బిల్‌ గేట్స్ హెచ్చరించారు.

అయితే వ్యాక్సిన్లతో పాటు కరోనా వైరస్‌ వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీల కారణంగా రాబోయే మహమ్మారి నుంచి కూడా బయటపడగలమని గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాక, వైద్యరంగంలో అందుబాటులోకి వస్తోన్న అధునాతన సాంకేతికత.. ఈ మహమ్మారులపై పోరాటంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇక, వ్యాక్సిన్ల పంపిణీ గురించి కూడా బిల్ గేట్స్‌ స్పందించారు. ‘‘2022 మధ్య నాటికి 70శాతం ప్రపంచ జనాభాకు వ్యాక్సిన్లు అందించాలన్న డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని