Imran Khan: ఆరోజు నేను గీత దాటి ఉండొచ్చు..క్షమించండి: ఇమ్రాన్‌ఖాన్‌

తనపై నమోదైన తీవ్రవాద కేసుకు సంబంధించి పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆగస్టు 20 జరిగిన ర్యాలీలో తాను గీత దాడి ఉండొచ్చని అందుకు క్షమించాలని కోరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Published : 02 Oct 2022 01:29 IST

ఇస్లామాబాద్‌: తనపై నమోదైన ఉగ్రవాద కేసుకు సంబంధించి పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘‘ఆగస్టు 20న ఇస్లామాబాద్‌ ర్యాలీలో మహిళా న్యాయమూర్తి విషయంలో నేను గీత దాటి ఉండొచ్చు. అందుకు క్షమాపణలు కోరుతున్నా. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను’’ అని ఇమ్రాన్‌ హైకోర్టుకు శనివారం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఆగస్టు 20న ఇస్లామాబాద్‌లో జరిగిన ర్యాలీలో జబా చౌదరి అనే మహిళా న్యాయమూర్తిని బెదిరించారంటూ సద్దార్‌ మెజిస్ట్రేట్‌ ఆలి జావేద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇమ్రాన్‌పై  కేసు నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సమయంలో అతడి నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదు. ఆ తర్వాత తాత్కాలిక బెయిల్‌ గడువును సెప్టెంబరు 12 వరకు పొడిగిస్తూ.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1 లక్ష రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాతి విచారణల్లోనూ ఫలితం లేకపోవడంతో సెప్టెంబరు 22న అతడిపై అభియోగాలు మోపాలని హైకోర్టు నిర్ణయించింది. కోర్టుకు స్వయంగా హాజరవ్వాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడం గమనార్హం. తన ప్రవర్తనపై అఫిడవిట్‌లో క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని, ముఖ్యంగా కిందిస్థాయి న్యాయవస్థపై కించపరిచే వ్యాఖ్యలు చేయనని అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మహిళా న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఇమ్రాన్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మహిళా న్యాయమూర్తి జబా చౌదరిని క్షమాపణలు అడిగేందుకు శుక్రవారం ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌ కోర్టుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఆమె అక్కడ లేనట్లు స్థానిక మీడియా పేర్కొంది. తాజాగా ఈ అఫిడవిట్‌ అంశం వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని