America: ‘టైటిల్‌ 42’కు తెర.. అమెరికా సరిహద్దులో ఏం జరుగుతోంది?

అమెరికాలో ఆశ్రయం కోరే వారిపై ‘టైటిల్‌ 42’ పేరుతో ఇప్పటివరకు కొనసాగిన ఆంక్షలు ముగిశాయి. దీని స్థానంలో కొత్త శరణార్థి విధానాన్ని అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.

Published : 12 May 2023 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెక్సికోతోపాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు శరణార్థుల (Asylum-seekers) తాకిడి కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. వీటిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలో కొవిడ్‌-19 విజృంభణ సమయంలో శరణార్థులపై ‘టైటిల్‌ 42’ పేరుతో అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షల (Asylum Restrictions) గడువు మే 11తో ముగిసింది. దీని స్థానంలో బైడెన్‌ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడంతో అమెరికా సరిహద్దుకు (Mexico-US border) భారీ సంఖ్యలో వలసదారులు క్యూ కడుతున్నారు.

ఏమిటీ టైటిల్‌ 42..?

అత్యవసర ఆరోగ్య పరిస్థితి (కరోనా) నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ‘టైటిల్‌ 42’ నిబంధనను తీసుకొచ్చింది. 2020 మార్చి నెలలో ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ప్రకారం.. అమెరికా-మెక్సికో సరిహద్దుకు (Mexico-US border) వచ్చే వలసదారులను తిరిగి వెనక్కి పంపించడంతోపాటు శరణు కోరడాన్ని తిరస్కరించవచ్చు. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుమారు 28లక్షల మంది వలసదారులను తిరస్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, శరణార్థులను నిలువరించినప్పటికీ చట్టపరమైన చర్యలు లేకపోవడంతో వారు మళ్లీ మళ్లీ వచ్చేందుకు కారణమయ్యింది.

జో బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘టైటిల్‌ 42’ను పక్కనపెట్టాలని నిర్ణయించారు. కొవిడ్‌ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో దీని స్థానంలో కొత్త రూల్స్‌ తీసుకువస్తామని ప్రకటించారు. రిపబ్లికన్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని కోరాయి. అయినప్పటికీ బైడెన్‌ ప్రభుత్వం మాత్రం దీనికి ముగింపు పలికి కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో టైటిల్‌ 42 గడువు మే 11తో ముగిసింది.

మరింత కఠినంగా కొత్త నిబంధనలు..!

కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా అమెరికాకు వచ్చి శరణు కోరవచ్చు. అయితే, ఇలా వచ్చే వారంతా ముందస్తుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ దేశాల నుంచి వచ్చేవారిని అమెరికా-మెక్సికో సరిహద్దులో పరీక్షిస్తారు. జాతి, మతం తదితర కారణాలతో స్వదేశంలో వేధింపుల భయం ఉందని చెప్పి ఆశ్రయం కోరేవారిని సరిహద్దులోనే ఇంటర్వ్యూ చేసి వారి అర్హతను తేల్చుతారు. ఒకవేళ ఎవరైనా.. అక్రమంగా సరిహద్దు దాటి ప్రవేశిస్తే మాత్రం వారిని ఐదేళ్లపాటు తిరిగి రానివ్వరు. అంతేకాకుండా అలా వచ్చిన వారు క్రిమినల్‌ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో అయితే.. వలసదారులు అక్రమంగా ప్రవేశించి శరణార్థి కోరేవారు. అనంతరం వారి అర్హతలను పరిశీలించి అనుమతి ఇవ్వడం, ఒక్కోసారి వారి ఇమ్మిగ్రేషన్‌ కేసు వచ్చే వరకు వేచి ఉండాలని కోరేవారు.

సరిహద్దులో పరిస్థితి ఏంటి..?

టైటిల్‌ 42 స్థానంలో కొత్త నిబంధనలు అమలు చేయనుండటంతో అమెరికా సరిహద్దుకు శరణార్థుల తాకిడి పెరిగినట్లు సమాచారం. వలసదారులతో సరిహద్దు ప్రాంతంలోని క్యాంపులు కిక్కిరిసిపోతున్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఈ వారం ఇప్పటికే వేల మంది సరిహద్దుకు చేరుకున్నారు. ఇలా అమెరికా- మెక్సికో సరిహద్దుకు నేరుగా వచ్చిన వేలాది మంది ఏం చేయాలో తోచక వేచిచూస్తున్నారు. అపాయింట్‌మెంట్‌ కోసం కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. మరోవైపు.. వారందరినీ వెనక్కి వెళ్లిపోవాలని అమెరికా అధికారులు మైకుల్లో ప్రకటన చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు వీలు లేదని వలసదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చేతిలో ఉన్న డబ్బు అయిపోవడంతోపాటు తినడానికి తిండి, ఉండటానికి చోటు కూడా లేదని వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మరోవైపు వెనెజువెలా, హైతీ, నికరాగువా, క్యూబా దేశాలకు చెందిన వారిని నెలకు 30 వేల మందికి అనుమతి ఇస్తామని అమెరికా వెల్లడించింది. గ్వాటెమాలా, ఎల్‌ సాల్వెడార్‌, హోండూరస్‌ దేశాలకు చెందిన వారినైతే లక్ష మందిని అనుమతిస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది. వీటితోపాటు సీబీపీ వన్‌ యాప్‌ ద్వారా అప్లై చేసుకున్న ఇతర వలసదారులను అనుమతిస్తారు. యాప్‌లో అయితే ప్రస్తుతం రోజుకు 750 మందిని అనుమతిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని