Miss Universe : మిస్‌ యూనివర్స్‌ పోటీలు.. నన్ను చూసి వారంతా పారిపోయారు..!

మిస్‌ రష్యా.. విశ్వ సుందరి(Miss Universe) పోటీల్లో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. 

Updated : 02 Feb 2023 12:31 IST

మాస్కో: ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌(Miss Universe) వేడుకలు వైభవంగా జరిగాయి. అమెరికా(US) భామ ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel) విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అగ్రరాజ్యంలో జరిగిన ఈ అందాల పోటీల్లో రష్యా భామ అన్నా లిన్నికోవా(Anna Linnikova) తీవ్ర నిరాదరణ, అవమానాలు ఎదుర్కొన్నారట. మీడియాతో మాట్లాడుతూ.. ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

‘అది నాకెంతో క్లిష్టమైన సమయం. పోటీలు ప్రారంభమైన దగ్గరి నుంచి ఉక్రెయిన్‌ సోషల్‌ మీడియా యూజర్ల నుంచి తీవ్రమైన అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నాను. మరీ ముఖ్యంగా పరిచయం ఉన్నవారి నుంచి ఈ అసహ్యకరమైన కామెంట్లు వచ్చాయి. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలిశాక  చాలామంది నన్ను దూరం పెట్టారు. మిస్‌ ఉక్రెయిన్‌, స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన వారైతే నన్ను నిప్పువలే చూసి దూరంగా పారిపోయారు’ అని ఆమె వాపోయారు. అయితే మిస్‌ వెనెజువెలా మాత్రం తనతో ఆప్యాయంగా మెలిగారని చెప్పారు. ఆ ప్రవర్తనే వెనెజువెలా భామ రెండో స్థానంలో నిలిచేందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ పోటీలు అమెరికా, ఉక్రెయిన్‌ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు.

‘మిస్‌ యూనివర్స్‌’ (Miss Universe) కిరీటం ఈ ఏడాది అగ్రరాజ్య వశమైంది. యూఎస్‌ భామకు మాజీ విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు.. ఈ కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ పోటీల్లో మిస్‌ వెనుజువెలా అమందా దుదామెల్ మొదటి రన్నరప్‌ కాగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని