అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన

తాను బైసెక్సువల్‌ అని మిస్‌ యూనివర్స్‌ ఫిలిప్పీన్స్‌ (Miss Universe Philippines) చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. 12 ఏళ్ల క్రితమే తాను ఈ విషయాన్ని గుర్తించినట్లు ఆమె చెప్పారు.

Published : 01 Jun 2023 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది విశ్వ సుందరి పోటీలకు ఫిలిప్పీన్స్‌ (Miss Universe Philippines) తరఫున పోటీ పడుతున్న అందాల భామ (మిస్‌ యూనివర్స్‌ ఫిలిప్పీన్స్‌) మిషెల్లీ మార్కెజ్‌ డీ (Michelle Marquez Dee) సంచలన ప్రకటన చేశారు. తన లైంగికత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ.. తాను బైసెక్సువల్‌ (bisexual) అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.

ఇటీవల మిషెల్లీ మార్కెజ్‌ (Michelle Marquez Dee) చిన్ననాటి ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అందులో ఆమె చాలా వరకు అబ్బాయి లుక్‌లో కన్పించడంతో ఆమె లింగత్వంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆమె ‘గే’ అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఊహాగానాలపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను బైసెక్సువల్‌. చాలా ఏళ్ల క్రితమే ఈ విషయం తెలుసుకున్నా. అన్ని రకాల అందాలకు నేను ఆకర్షితురాలినవుతా. ఈ విషయాన్ని మే 13న జరిగిన ఫిలిప్పీన్స్‌ అందాల పోటీల్లోనే చెప్పాలనుకున్నా. కానీ, అది సరైన సమయం కాదనిపించింది. పోటీల్లో ఆ విషయం చెబితే అంతా ఆశ్చర్యపోతారు. ఎవరికి వారు సొంత అభిప్రాయాలు వ్యక్తీకరిస్తారు. అందుకే చెప్పలేదు’’ అని మిషెల్లీ మ్యాగజైన్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

12 ఏళ్ల వయసులోనే తాను బైసెక్సువల్‌ అని తెలుసుకున్నానని మిషెల్లీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయం తన స్నేహితుల్లో చాలా మందికి తెలుసని, బయటి ప్రపంచానికి మాత్రం ఇప్పుడే అధికారికంగా ప్రకటిస్తున్నానని అన్నారు. ‘‘ఈ విషయాన్ని చెప్పాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే లింగత్వం మాత్రమే గుర్తింపు కాదు. అంతకంటే ఎక్కువే సాధించా. అందుకే ఇప్పటిదాకా చెప్పలేదు. అయితే నాకు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీలో చాలా మంది స్నేహితులున్నారు. ప్రైడ్‌ మార్చ్‌లకు కూడా వెళ్లాను. నేనూ ఈ కమ్యూనిటీకే చెందిన వ్యక్తినని గట్టిగా, గర్వంగా చెబుతున్నా’’ అని మిషెల్లీ వివరించారు.

ఏటా విశ్వ సుందరి పోటీల్లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అందాల భామను ఎంపిక చేసేందుకు మిస్‌ యూనివర్స్‌ ఫిలిప్పీన్స్‌ (Miss Universe Philippines) పోటీలను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మే 13 జరిగిన ఈ తుది పోటీల్లో మిషెల్లీ విజేతగా నిలిచింది. త్వరలో ఎల్‌ సాల్వడార్‌లో జరిగే 72వ మిస్‌ యూనివర్స్‌ (Miss Universe) పోటీల్లో ఆమె ఫిలిప్పీన్స్‌ తరఫున పోటీపడనున్నారు.

కాగా.. అందాల ప్రపంచంలో LGBTQ+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మిషెల్లీ ఒక్కరే కాదు. గతేడాది మాజీ మిస్‌ అర్జెంటినా మరియానా వారెలా.. మాజీ మిస్‌ ప్యూర్టోరికా ఫాబియోలా వాలెంటినా వివాహం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని