Modi-Russia: టీమ్‌ఇండియా విజయ రహస్యం అదే: రష్యాలోని ప్రవాస భారతీయులతో మోదీ

ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) ప్రవాస భారతీయుల్ని(Indian Community) ఉద్దేశించి ప్రసంగించారు. మన ఎదుగుదలను ప్రపంచం గుర్తిస్తోందని అన్నారు. 

Updated : 09 Jul 2024 15:23 IST

మాస్కో: రాబోయే ఈ ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఇటీవలే మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశానని, మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మంగళవారం రష్యా (Russia) రాజధాని మాస్కోలో ప్రవాస భారతీయుల (Indian Community)ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడికి తాను ఒక్కడినే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను వెంట తీసుకొని వచ్చానని వ్యాఖ్యానించారు. 

భారత్ సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోంది..

‘‘ఏ దేశానికి సాధ్యం కానివిధంగా చంద్రయాన్‌ ప్రయోగం చేశాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందాం. డిజిటల్‌ లావాదేవీల్లో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉన్నాం. స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకున్నాం. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయి. భారత్‌ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్యబీమా వ్యవస్థ భారత్‌లో ఉంది. భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా నిలబెడతాను. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్ఠమైంది’’ అని వివిధ రంగాల్లో భారత్ సాధిస్తోన్న విజయాలను ప్రస్తావించారు. భారత్‌ ఘనతను ప్రపంచం గుర్తించకతప్పని పరిస్థితి తెచ్చామని వ్యాఖ్యానించారు. భారత యువతే దేశ నిజమైన ఆస్తి అని, ఆత్మవిశ్వాసం దేశానికి అతిపెద్ద ఆయుధమని అన్నారు. సవాళ్లను సవాల్‌ చేయడం తన డీఎన్‌ఏలోనే ఉందన్నారు.

టీ20 ప్రపంచకప్‌ విజయ రహస్యం అదే.. 

‘‘ఇటీవల టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన సందర్భాన్ని మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. గెలుపు కోసం వారు పడిన ఆరాటం.. అందుకు సాగించిన ప్రయాణమే వారి విజయం వెనుక ఉన్న అసలు కథ. ఈ రోజుల్లో యువత చివరి క్షణం (చివరి బంతి) వరకు ఓటమిని అంగీకరించడం లేదు. అలా ముందుకుసాగే వారినే విజయం వరిస్తుంది’’ అని రోహిత్‌ సేనను ప్రధాని కొనియాడారు. అలాగే మన ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడంతో సినిమాలది కీలక పాత్ర అని చెప్పారు. ఈ సందర్భంగా అలనాటి ప్రముఖ నటులు రాజ్‌కపూర్‌, మిథున్‌ చక్రవర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి సినిమాలు రష్యాలో ప్రజాదరణ పొందాయని చెప్పారు.

పుతిన్‌కు కృతజ్ఞతలు..

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం వేళ.. భారత విద్యార్థులు చిక్కుకుపోతే, వారిని కాపాడటంలో పుతిన్ సహకరించారని మోదీ గుర్తుచేశారు. ఈసందర్భంగా ఆయనతో పాటు రష్యా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘భారత్-రష్యా నమ్మకమైన మిత్రులు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఈ స్నేహం కొనసాగుతోంది. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు ఎంత మైనస్‌లోకి పడిపోయినా సరే.. మన రెండు దేశాల మధ్య  బంధం ఎప్పుడూ ప్లస్‌లోనే ఉంటుంది.  అది మన స్నేహాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇప్పటివరకు నేను ఆరుసార్లు రష్యాలో పర్యటించాను. పుతిన్‌తో 17 సార్లు భేటీ అయ్యాను’’ అని తెలిపారు.

రష్యాలో కొత్తగా రెండు భారత కాన్సులేట్‌లు..

రష్యాతో వాణిజ్య, పర్యటక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యాలోని కజాన్‌, యెకాటీరీన్‌బర్గ్‌ నగరాల్లో కొత్తగా రెండు భారత కాన్సులేట్‌లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. యెకాటీరీన్‌బర్గ్‌ రష్యాలో నాలుగో అతిపెద్ద నగరం. ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా ఉద్భవించింది. 2018లో రష్యాలో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌లో పలు మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించారు. మరోవైపు.. వోల్గా, కజాంకా నదుల సంగమం వద్ద ఉన్న కజాన్.. సాంస్కృతిక, విద్యాకేంద్రంగా విలసిల్లుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కజాన్‌లోనే బ్రిక్స్ సదస్సును నిర్వహించనున్నారు. ప్రస్తుతం   ఆ దేశంలో భారత్‌కు రెండుచోట్ల కాన్సులేట్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, వ్లాడివోస్టాక్‌)లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని