G20 Summit: జీ-20 సదస్సు వేళ.. రిషి సునాక్‌, ప్రధాని మోదీ ముచ్చట్లు..

ఇండోనేసియాలో జరుగుతోన్న జీ-20 సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్‌ కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య బుధవారం నాడు విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయి.

Published : 15 Nov 2022 14:31 IST

బాలి: ఇండోనేసియాలో జరుగుతోన్న జీ-20 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సభ్యదేశాల అధిపతులతోనూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో సదస్సు మొదటి రోజున బ్రిటన్‌ నూతన ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ప్రధాని మోదీని కలిసి ముచ్చటించారు. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ మోదీని కలవడం ఇదే తొలిసారి.

‘జీ-20 సదస్సు ప్రారంభం రోజు భారత్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, రిషి సునాక్‌లు సంభాషించుకున్నారు. సునాక్‌తోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మూన్యుయేల్ మెక్రాన్లను ప్రధాని మోదీ కలిశారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతోపాటు రిషి సునాక్‌, మెక్రాన్‌లతో బుధవారం ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు’ అని భారత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా రిషి, మోదీ తొలిసారి కలిసి ముచ్చటిస్తోన్న ఫొటోలను విడుదల చేసింది.

వాతావరణ మార్పులు, కొవిడ్‌-19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో పరిస్థితులతోపాటు దానితో ముడిపడి ఉన్న అంతర్జాతీయ సమస్యలు ప్రపంచంలో విధ్వంసానికి కారణమయ్యాయని జీ-20 సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీంతో ప్రపంచ సరఫరా గొలుసు శిథిలావస్థకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ పుట్టిన పవిత్ర నేలపై వచ్చే ఏడాది జీ-20 సదస్సు జరగనుందని.. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతికి బలమైన సందేశం ఇచ్చేందుకు మనమందరం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని