Modi-Putin: జులైలో రష్యా పర్యటనకు మోదీ..!

జులై నెలలో ప్రధాని మోదీ(Modi) అత్యంత కీలకమైన విదేశీ పర్యటన చేయనున్నారు. మిత్ర దేశం రష్యా(Russia)లో పర్యటించనున్నట్లు సమాచారం. 

Updated : 25 Jun 2024 19:05 IST

మాస్కో: ప్రధాని నరేంద్రమోదీ(Modi) జులైలో రష్యాలో పర్యటించనున్నారని సమాచారం. భారత్‌-రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. మోదీ పర్యటన విషయంలో రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్‌తో ఆయన సమావేశం ఉంటుందని మార్చి నెలలో క్రెమ్లిన్‌ వెల్లడించింది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో భారత్‌ స్వతంత్ర వైఖరి ప్రదర్శిస్తోంది. అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలు ఉన్నప్పటికీ.. మనం మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా.. మాస్కో-దిల్లీ మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని గతంలోనే పుతిన్‌ స్పష్టంచేశారు. ఉక్రెయిన్ పరిణామాలపై తాను మోదీతో మాట్లాడానని చెప్పారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం దిశగా భారత ప్రధాని తనవంతు ప్రయత్నాలు చేస్తారని తనకు తెలుసన్నారు. అలాగే తన స్నేహితుడు మోదీని కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఆయన రష్యా వస్తే.. వర్తమాన అంశాలు, రెండు దేశాల సంబంధాల బలోపేతం గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆయన తన దేశంలో పర్యటించాలని గతంలో ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, పుతిన్‌ మాత్రం భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సుకు హాజరుకాలేదు. దీనిపై ఆయన గతంలో స్పష్టత ఇచ్చారు. సమావేశాల సమయంలో నా స్నేహితులకు ఎందుకు సమస్యలు సృష్టించాలి?’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల ఉక్రెయిన్‌లో శాంతి సాధనకు స్విట్జర్లాండ్‌లో నిర్వహించిన సదస్సులో భారత్‌ తన ప్రతినిధిని పంపింది. స్విస్‌ శాంతి సాధన సదస్సు సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేయలేదు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వెంటనే ముగిసిపోవాలని భారత్‌ బలంగా కోరుకుంటున్నా, మాస్కోతో ద్వైపాక్షిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి సిద్ధంగా లేదని ఈ పరిణామం వెల్లడి చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని