Modi- Taiwan: మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్‌ కీలక వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీకి తైవాన్‌ నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే ఇటీవల శుభాకాంక్షలు చెప్పగా.. ఆ పోస్ట్‌కు మోదీ బదులిచ్చారు. దీన్ని చైనా తట్టుకోలేకపోయింది. అయితే.. డ్రాగన్‌ స్పందనను తైవాన్‌ తాజాగా ఖండించింది.

Published : 19 Jun 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తైవాన్‌ (Taiwan) నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే కూడా శుభాకాంక్షలు చెప్పగా.. ఆ పోస్ట్‌కు మోదీ బదులిచ్చారు. దీన్ని చైనా (China) తట్టుకోలేకపోయింది. ఆ ప్రాంత రాజకీయాలను ప్రతిఘటించాలంటూ మనపై నోరు పారేసుకుంది. అయితే.. డ్రాగన్‌ స్పందనను తైవాన్‌ తాజాగా ఖండించింది. ఇటువంటి అభ్యంతరాలకు ప్రధాని మోదీ, తమ దేశాధ్యక్షుడు లాయ్‌ బెదిరిపోరని తైవాన్‌ ఉప విదేశాంగశాఖ మంత్రి తియెన్‌ చుంగ్‌ క్వాంగ్‌ స్పష్టం చేశారు.

‘‘మోదీజీ మూడోసారి ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో లాయ్‌ చింగ్‌ తే అభినందనలు తెలిపారు. మోదీ కూడా బదులిచ్చారు. ఇలా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పడం సాధారణమే. దీనిపై ఇతర వ్యక్తులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు నేతల మధ్య వ్యవహారంలో తలదూర్చడం అసమంజసమైన చర్యే. మోదీ, మా అధ్యక్షుడు లాయ్‌లు ఇటువంటి విషయాల్లో బెదిరిపోరు’’ అని మీడియాతో క్వాంగ్‌ పేర్కొన్నారు.

అమెరికాను కలసికట్టుగా ఎదుర్కొంటాం.. కిమ్‌తో భేటీ వేళ పుతిన్‌

అంతకుముందు భారత్‌, తైవాన్‌ నేతల ‘ఎక్స్‌’ సంభాషణలపై బీజింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై దిల్లీ వద్ద నిరసన వ్యక్తం చేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ తెలిపారు. ‘‘తైవాన్‌కు అసలు అధ్యక్షుడే లేడు. మాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగిఉన్న దేశాలు.. అక్కడి అధికారులతో అధికారిక సంభాషణలు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. తైవాన్‌ కూడా అందులోని భూభాగమే. అక్కడి అధికారుల రాజకీయాలను భారత్‌ ప్రతిఘటించాలి’’ అని అన్నారు. ఈ అంశంపై అమెరికా స్పందిస్తూ.. దౌత్య రంగంలో అభినందన సందేశాలు సర్వసాధారణమేనంటూ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని