Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్‌.. నిక్‌నేమ్‌ కూడా పెట్టారట..!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నరేంద్ర మోదీ(Narendra Modi) .. చైనా నెటిజన్లలోనూ పాపులర్‌ అయినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Updated : 19 Mar 2023 21:27 IST

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా కొందరు నేతలు ఎంతో గుర్తింపు పొందుతూ, ప్రశంసలు దక్కించుకుంటున్నప్పటికీ.. చైనీయుల (China) మెప్పు పొందడం కాస్త అరుదనే చెప్పొచ్చు. అటువంటి వారి మనసును కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గెలుచుకున్నట్లు ఓ అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. ఆయనపై అభిమానంతో ‘మోదీ చిరంజీవుడు’ అనే మారుపేరుతోనూ వారు పిలుచుకుంటున్నట్లు సమాచారం. చైనా- భారత్‌ల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోన్న వేళ.. మోదీ విషయంలో చైనీయులకు సానుకూల అభిప్రాయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన వ్యూహాత్మక సంబంధాల మ్యాగజైన్‌ ‘ది డిప్లొమాట్‌’ పేర్కొంది.

‘భారత్‌ను చైనా ఏవిధంగా చూస్తోంది..?’ పేరిట ఈ మ్యాగజైన్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ‘నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌.. ప్రపంచంలోని ప్రధాన దేశాలతో సమతౌల్యాన్ని కొనసాగిస్తోందని చైనీయులు భావిస్తున్నారు’ అని సినా విబో వంటి చైనా సామాజిక మాధ్యమాలను విశ్లేషించే ము చున్‌షాన్‌ అనే జర్నలిస్టు తాజా కథనంలో వెల్లడించారు.

చైనా ఇంటర్నెట్‌లో మోదీకి అసాధారణమైన మారుపేరు ఉంది. అదే ‘మోదీ లావోషియన్‌’. అసాధారణ సామర్థ్యాలు ఉన్న వృద్ధ వ్యక్తిని అలా పిలుస్తుంటారు. ‘ఇతర నేతలతో పోలిస్తే మోదీ భిన్నమైన వ్యక్తి అని చైనా నెటిజన్ల భావన. మోదీ వస్త్రధారణ, ఆహార్యంతోపాటు ఆయన విధానాలు మునుపటి నేతలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోవడంతోపాటు మొండితనం వంటి తీరును గమనించి.. మోదీని అలా పిలుస్తున్నారని అనిపిస్తోంది’ అని చున్‌షాన్‌ అభిప్రాయపడ్డారు.

ఇతర ప్రధాన దేశాలతో భారత్‌ సంబంధాలను ప్రస్తావించిన ము చున్‌షాన్‌ .. రష్యా, అమెరికా, ఇతర దక్షిణాసియా దేశాలతో భారత్‌ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం కొంత మంది చైనా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని చెప్పారు. 20 ఏళ్లుగా అంతర్జాతీయ మీడియా వ్యవహారాలను చూస్తున్నానని.. చైనా నెటిజన్లు ఓ విదేశీ నేతకు ఇలా నిక్‌నేమ్‌ పెట్టడం చాలా అరుదని ము చున్‌షాన్‌ వెల్లడించారు. చైనా ప్రజలపై మోదీ ముద్ర వేశారనడానికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని