Updated : 29 Jul 2022 12:53 IST

Monkeypox: మంకీపాక్స్ లక్షణాల్లో మార్పు.. కొత్త అధ్యయనం ఏం చెప్తోందంటే..?

అమెరికా, ఐరోపాను వణికిస్తోన్న వైరస్‌

జెనీవా: కరోనాతో ఉక్కిరిబిక్కిరై ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ప్రపంచాన్ని మంకీపాక్స్(Monkeypox) కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 78 దేశాలకు వ్యాపించగా.. 18 వేలమంది దీని బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)వెల్లడించింది. ఐరోపా, అమెరికా దేశాలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని సంస్థ డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ వెలుగుచూసిన కేసుల్లో 95 శాతం ఈ రెండు ప్రాంతాల నుంచే వచ్చాయని మీడియాకు తెలిపారు. 70 శాతానికి పైగా కేసులు ఐరోపా నుంచి, 25 శాతం కేసులు అమెరికా ప్రాంతం నుంచి బయటపడ్డాయని పేర్కొన్నారు. అలాగే.. ప్రస్తుత వ్యాప్తిలో లక్షణాల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనమొకటి తెలిపింది.

ఈ ఏడాది మేలో మంకీపాక్స్‌ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఇప్పటివరకు గుర్తించిన మొత్తం కేసుల్లో 98 శాతం.. స్వలింగ సంపర్క పురుషుల్లోనే ఉన్నాయని టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే స్త్రీ-పురుషులిద్దరితోనూ శృంగారంలో పాల్గొనే మగవారిలోనే ఈ కేసులు వెలుగుచూశాయని చెప్పారు. ఇటీవల మాట్లాడుతూ.. ఈ వ్యాధి బారిన పడే ముప్పును తగ్గించుకునేందుకుగాను ముఖ్యంగా పురుషులు శృంగార భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. తాజాగా ఈ వ్యాధి గురించి తప్పుడు సమాచారంపై హెచ్చరించారు. ‘ఆన్‌లైన్ వేదికగా కొవిడ్-19 గురించి ఏ స్థాయిలో తప్పుడు సమాచారం జరిగిందో చూశాం. ఈ మంకీపాక్స్ విజృంభణ సమయంలో అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సోషల్ మీడియా, వార్తా సంస్థలు, టెక్‌ సంస్థలు మాతో కలిసి పనిచేయాలని కోరతాం. సామాజిక వివక్ష.. వైరస్‌ కంటే ప్రమాదకరమైంది. ఇది వ్యాప్తికి ఆజ్యం పోస్తుంది’ అని హెచ్చరించారు.

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుండటంతో ఇటీవల ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా (global health emergency) ప్రకటించింది. ‘పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్న్‌ (పీహెచ్‌ఈఐసీ)‌’నే అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా పిలుస్తారు. ఓ దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనగా మారిన అసాధారణ పరిస్థితుల్లో దీనిని ప్రకటిస్తారు. తద్వారా.. అంతర్జాతీయ దేశాలన్నీ సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిస్తుంది. 

లక్షణాల్లో తేడాలొచ్చాయి..!

మంకీపాక్స్ గత విజృంభణలతో పోలిస్తే.. ప్రస్తుత ఉద్ధృతిలో కనిపిస్తోన్న లక్షణాల్లో తేడా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌(బీఎంజే)లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలిన 197 మంది పురుషులపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆ 197 మందిలో 196 మంది స్వలింగ సంపర్కులే. 2007-11(డెమొక్రాటిక్‌ రిపబ్లిక్ ఆఫ్ కాంగో), 2017-18(నైజీరియా)లో సంభవించిన వ్యాప్తితో పోల్చిచూడగా.. పురుషాంగం వాపు, మలద్వారం వద్ద నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు తేలింది. ఈ లక్షణాలు కనిపిస్తోన్న బాధితులపై సమీక్షను కొనసాగించాలని అధ్యయనకర్తలు సూచించారు. అలాగే లక్షణ రహిత, స్వల్పస్థాయి లక్షణాలు కలిగిన వ్యక్తుల నుంచి ఈ వైరస్ సోకుంతుందని, అయితే అది స్వల్పస్థాయిలోనేనని పేర్కొన్నారు.  

ఏంటీ వైరస్‌..

మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని