Monkeypox: 50 దేశాలకు పాకిన మంకీపాక్స్‌.. ప్రస్తుతానికి అత్యయిక స్థితి కాదు : WHO

ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ (Monkeypox) వ్యాప్తి ప్రస్తుతానికి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయించింది.

Published : 28 Jun 2022 02:05 IST

సిడ్నీ: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ (Monkeypox) వ్యాప్తిని ప్రస్తుతానికి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయించింది. అయితే, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి 50 దేశాలకు వ్యాపించడం ఆందోళనకర అంశమేనని స్పష్టం చేసింది. మంకీపాక్స్‌ ప్రాబల్యం, పొంచివున్న ముప్పుతోపాటు పేరు మార్పుపై చర్చించేందుకు అంతర్జాతీయ నిపుణులు, భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘మంకీపాక్స్‌ (Monkeypox) ఇప్పటికే 50 దేశాలకు వ్యాపించింది. ఆస్ట్రేలియాలో 13 కేసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4100 కేసులు వెలుగు చూశాయి. బయటపడని కేసుల సంఖ్య భారీగానే ఉండవచ్చు. ఈ వ్యాధి వల్ల పొంచివున్న ముప్పుపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతానికి దీన్ని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించవద్దని నిర్ణయించామని.. కానీ, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మారే ప్రమాదం ఉందన్నారు.

ఇదిలా ఉంటే, ఈ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో.. మంకీపాక్స్‌ అనే పేరుతో పిలవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒక ప్రాంతంపై వివక్షత (Discrimination) చూపించేలా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌కు కొత్త పేరును (New Name) నిర్ణయించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని