Monkeypox: కరోనా తరహాలో మంకీపాక్స్‌ ఉండదు: డబ్ల్యూహెచ్‌ఓ

మంకీపాక్స్‌ వైరస్‌ కరోనా అంత ప్రమాదకారి కాదని, నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.......

Published : 27 May 2022 19:57 IST

జెనీవా: మంకీపాక్స్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోన్న వైరస్‌. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటంతో పలు దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వైరస్‌ కరోనా అంత ప్రమాదకారి కాదని, నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. కానీ, దీనిపై పలు అనిశ్చితులు నెలకొన్నాయని పేర్కొంటూ.. ఈ వైరస్‌ నివారణకు వినియోగించే మచూచి టీకాలు ఏయే దేశాల వద్ద ఎన్ని ఉన్నాయో తమ వద్ద పూర్తి సమాచారం లేదని తెలిపింది.

ప్రస్తుతం 20 దేశాల్లో 200లకు పైగా మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే గతంలో ఈ వైరస్‌ ఆనవాళ్లు లేని దేశంలోనూ ఈ కేసులు బయటపడటం, పశ్చిమ ఆఫ్రికా బయట మొట్టమొదటిసారి దీన్ని గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాల్లో మంకీపాక్స్‌ వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ.. సమాజంలో వ్యాప్తిచెందే తీరును అంచనా వేయడం కష్టమని పేర్కొంది. కానీ దానిపై దృష్టిసారిస్తే నివారించడం కష్టం కాదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు సిల్వీ బ్రియాండ్‌ సంస్థ వార్షిక అసెంబ్లీలో మాట్లాడుతూ.. సరైన చర్యలు తీసుకోగలిగితే మంకీపాక్స్‌ను సులువుగా కట్టడి చేయవచ్చని వెల్లడించారు.

ఆరోగ్య సంస్థకు చెందిన మరో అధికారి మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ వ్యాప్తి చెందిన తర్వాత దాని చికిత్స ఏడాది పాటు మిస్టరీలా ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణించారు. కానీ మంకీపాక్స్‌ అలా కాదు. దీనికి చికిత్స ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. వైరస్‌ సోకిన వారికి టీకా అందిస్తే రెండు నుంచి నాలుగు వారాల్లోపు కోలుకుంటారు. దీని కట్టడికి సామూహిక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అవసరంలేదు. ప్రస్తుతం వైరస్‌ సోకినవారి క్లోజ్‌ కాంటాక్ట్‌లకు సరిపడే టీకాలు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పదికిపైగా ఆఫ్రికా దేశాల్లో వేలాది కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని