Monkeypox: 19 దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్‌..!

ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ పలు దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆస్ట్రియా, స్లొవేనియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాలకూ పాకింది.

Published : 26 May 2022 01:21 IST

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ పలు దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆస్ట్రియా, స్లొవేనియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాలకూ పాకింది. ఇలా ఇప్పటివరకు 19 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే 131 కేసులు నిర్ధారణ కాగా మరో 106 అనుమానిత కేసులు ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆఫ్రికా కాకుండా ఇతర దేశాల్లోనే మొత్తం 237 మంకీపాక్స్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. దీనివల్ల ముప్పు మాత్రం తక్కువేనని స్పష్టం చేసింది.

ఇటీవల బెల్జియంలో మ్యుజిక్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయని చెక్‌రిపబ్లిక్‌ అధికారులు వెల్లడించారు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఇక ఆస్ట్రియాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్‌ లక్షణాలతో ఈ ఆదివారం ఆస్పత్రిలో చేరాడు. అనంతరం జరిపిన పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయ్యిందని వియన్నా వైద్యాధికారులు వెల్లడించారు. మరోవైపు కానరీ ద్వీపం నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు గుర్తించి పరీక్షించగా వ్యాధి సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రెండు వందలకుపైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మంకీపాక్స్‌ వైరస్‌ మ్యుటేషన్‌ చెందిందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ కేసులు క్రమంగా పెరగడానికి కారణాలేంటనే దానిపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌ఓ.. వీటి మూలాలు కనుక్కోవడంతోపాటు వైరస్‌లో మార్పులను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపించే ఈ వ్యాధి వల్ల ఇప్పటివరకు ఏ దేశంలోనూ మరణిం సంభవించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని