Hajj pilgrimage: హజ్‌ యాత్రలో 1,300 మంది మృతి.. 83% అక్రమంగా వచ్చినవారే!

Hajj pilgrimage: తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలుల కారణంగా ఈ ఏడాది హజ్‌ యాత్రలో 1,300 మందికి పైగా మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Published : 24 Jun 2024 08:32 IST

Hajj pilgrimage | రియాద్‌: ఈ ఏడాది హజ్‌ యాత్రలో (Hajj pilgrimage) 1,300 మందికి పైగా మృతిచెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ఆదివారం ప్రకటించాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలులే అందుకు కారణమమని వెల్లడించాయి. చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని తెలిపాయి. వీరిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి భగభగమండే ఎండల్లో నడుచుకుంటూ వచ్చారని సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్‌బిన్‌ అబ్దుర్రహ్మాన్‌ అల్‌-జలజెల్‌ వెల్లడించారు.

95 మంది యాత్రికులకు (Hajj pilgrims) చికిత్స అందుతున్నట్లు అధికారిక టీవీ ఛానల్‌ ఎఖ్‌బరియా టీవీతో మాట్లాడుతూ ఫహద్‌బిన్‌ అబ్దుర్రహ్మాన్‌ తెలిపారు. వీరిలో కొంత మందిని మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రాజధాని రియాద్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు తెలిపారు. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది హజ్‌ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్టు వాసులు ఉన్నారని ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 31 మంది మినహా మిగతావారంతా అక్రమంగా హజ్‌ యాత్రకు వెళ్లినవారేనని తెలిపాయి. వీరిని తీసుకెళ్లిన 16 ట్రావెల్‌ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఈజిప్టు నుంచి ఈ ఏడాది మొత్తం 50 వేల మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతితో హజ్‌కు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

చట్టవిరుద్ధంగా హజ్‌ యాత్రకు (Hajj pilgrimage) వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు వెనక్కి పంపారు. కొంత మంది ఎలాగోలా మక్కా సహా సమీప ప్రాంతాల్లోని పవిత్ర స్థలాలకు చేరుకున్నారు. వారు ఉండడానికి హోటళ్లు, గూడారులు సహా ఎలాంటి వసతులు లేవు. దీంతో ఎండతాపం నుంచి కాపాడుకునేందుకు వారికి మార్గమే లేకుండా పోయింది. దీనివల్లే మరణాలు ఎక్కువైనట్లు అధికారులు తెలిపారు.

మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో జోర్డాన్‌, టునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా సహా ఇతర దేశాల నుంచి ఉన్నారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’ వెల్లడించింది. ఇద్దరు అమెరికా పౌరులు కూడా ఉన్నట్లు తెలిపింది.

హజ్‌ యాత్రలో (Hajj pilgrimage) మరణాలు కొత్తేమీ కాదు. ఐదు రోజుల యాత్ర కోసం ఏటా దాదాపు 20 లక్షల మంది వరకు సౌదీ వెళ్తుంటారు. గతంలో అంటువ్యాధులు ప్రబలిన సందర్భాలూ ఉన్నాయి. తొక్కిసలాటలూ చోటుచేసుకున్నాయి. 2015లో మైనాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు మక్కాలో క్రేన్‌ కూలిన ఘటనలో 111 మంది మరణించారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని