Iran Protests: ఆందోళనల్లో మరణాలపై పెదవి విప్పిన ఇరాన్‌.. ఎన్నంటే?

దేశాన్ని కుదిపేస్తోన్న హిజాబ్‌ వ్యతిరేక నిరసనల్లో మరణాలపై ఇరాన్‌ ప్రభుత్వం తొలిసారి పెదవి విప్పింది. రెండు నెలలకుపైగా సాగుతోన్న ప్రదర్శనల్లో ఇప్పటివరకు 300మందికిపైగా మృతి చెందినట్లు మంగళవారం వెల్లడించింది.

Published : 30 Nov 2022 01:29 IST

టెహ్రాన్‌: దేశాన్ని కుదిపేస్తోన్న హిజాబ్‌ వ్యతిరేక నిరసన(Iran Protests)ల్లో మరణాలపై ఇరాన్‌ ప్రభుత్వం తొలిసారి పెదవి విప్పింది. రెండు నెలలకుపైగా సాగుతోన్న ప్రదర్శనల్లో ఇప్పటివరకు 300మందికిపైగా మృతి చెందినట్లు మంగళవారం వెల్లడించింది. ‘మహసా అమినీ మరణంతో దేశంలోని ప్రతి ఒక్కరిపై ప్రభావం పడింది. తదనంతర ఘటనల్లో దేశవ్యాప్తంగా చిన్నారులతోసహా 300 మందికి పైగా పౌరులు, సిబ్బంది మరణించి ఉండొచ్చు’ అని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్ బ్రిగేడియర్ జనరల్ అమిరాలి హజిజాదే ఓ వార్తా సంస్థకు తెలిపారు. మృతుల్లో పోలీసులు, సైనికులు, మిలిషియా సభ్యులూ ఉన్నట్లు చెప్పారు.

మరోవైపు.. నార్వేలోని ‘ఇరాన్ హ్యూమన్ రైట్స్’ సంస్థ ప్రకారం ఇప్పటివరకు ఇరాన్‌లో 448 మంది మరణించారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబరులో మాసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌లో ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఆమె హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్‌ 17న మొదలైన నిరసనలు.. క్రమంగా తీవ్రతరమయ్యాయి. ఈ ప్రదర్శనలను అల్లర్లుగా అభివర్ణిస్తోన్న ఇరాన్‌.. వాటిని ఎక్కడికక్కడ అణచివేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని