Hajj Pilgrims: హజ్‌ యాత్రలో 550 మంది యాత్రికులు మృతి

Hajj Pilgrims: ఈసారి హజ్‌ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారు. ఎండల తీవ్రతకు దాదాపు 550 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Updated : 19 Jun 2024 07:47 IST

మీనా (సౌదీ అరేబియా): సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈసారి దాదాపు 550 మంది యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈజిప్టు దేశానికి చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణమే అందుకు కారణం. మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు.

మక్కా సమీపంలో ఉన్న అల్-ముయిసెమ్‌లోని ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించాయి. తమ దేశం నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్‌ నిర్వహకులకు తెలియజేశాయి. వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి. చనిపోయిన వారిలో 60 మంది జోర్డాన్‌వాసులు కూడా ఉన్నారు. గత ఏడాది 240 మరణాలు నమోదయ్యాయి. వీరిలో చాలా మంది ఇండోనేషియాకు చెందినవారు.

ఎండ తాపాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహకులు అనేక ఏర్పాట్లు చేశారు. యాత్రికులు గొడుగులు వాడాలని, ఎప్పటికప్పుడు నీరు తాగాలని సూచించారు. వారిపై నీళ్లు చిలకరించేలా వాలంటీర్లను నియమించారు. అయినప్పటికీ.. పెద్ద ఎత్తున మరణాలు సంభవించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు