Brussels: అరాచకం సృష్టించిన మొరాకో ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌..!

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో (Morocco) ఓటమి ఐరోపా దేశాల్లో అల్లర్లకు కారణమైంది. ఆ జట్టు అభిమానులు వీధుల్లో అల్లర్లకు దిగారు.

Updated : 15 Dec 2022 12:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో(Morocco) ఓటమి ఐరోపాలోని బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో హింసకు కారణమైంది. నేడు జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ (France )జట్టు.. మొరాకో(Morocco)ను 2-0తేడాతో ఓడించింది. దీంతో బ్రస్సెల్స్‌లోని మొరాకో(Morocco) ఫ్యాన్స్‌ ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు. దాదాపు 100 మందితో కూడిన ఓ అల్లరి మూక విధ్వంసం సృష్టించింది. వీరు పోలీసులతో ఘర్షణపడ్డారు. దీంతోపాటు చేతిలో టపాసులను విసురుతూ.. వీధుల్లో చెత్త సంచులు వంటి వాటిని ఓ చోటకు చేర్చి నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఈ ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఓ మొరాకో (Morocco) అభిమాని రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు ఫ్రాన్స్‌ (France ) అభిమానులు కొందరు తెల్లటి కారులో అక్కడకు వచ్చి యూటర్న్‌ తిప్పే సమయంలో ఓ బాలుడు చక్రాల కింద నలిగిపోయాడు. తీవ్రగాయాల పాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌ సందర్భంగా ఐరోపా సమాఖ్యలోని ఫ్రాన్స్‌, బెల్జియంలోని పలు చోట్ల భారీగా ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. వీటిని అదుపు చేయడానికి పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమించాయి. ఫ్రాన్స్‌(France )లోని మాంట్‌పెల్లిర్‌, నైస్‌ పట్టణాల్లో వీధిపోరాటాలు జరిగాయి. పరస్పరం బాణసంచా విసురుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని