Ukraine Crisis: ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ చర్చలకు సిద్ధమే.. రష్యా ప్రకటన

ఉక్రెయిన్‌- రష్యాల ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తించడం.. అక్కడికి రష్యా సేనలను పంపించాలని ఆదేశించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. అయితే...

Published : 22 Feb 2022 17:28 IST

మాస్కో: ఉక్రెయిన్‌- రష్యాల ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తించడం.. అక్కడికి రష్యా సేనలను పంపించాలని ఆదేశించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. అయితే.. ఈ వివాదంపై ఇప్పటికీ చర్చలకు సిద్ధమేనని రష్యా ఓ ప్రకటన చేసింది. తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నారని మంగళవారం తెలిపింది. ‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ చెబుతున్నాం... మేం చర్చలకు సిద్ధమే’ అని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా వ్యాఖ్యానించారు. తాము ఎల్లప్పుడూ దౌత్య పరిష్కారాలకు అనుకూలంగా ఉంటామని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా చర్యలను బ్రిటన్‌ సహా పలు దేశాలు ఖండిస్తున్నాయి. పుతిన్‌ నిర్ణయాలను తప్పుబట్టిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీ ఛాన్స్‌లర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సైతం రష్యా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఐరోపా సమాఖ్య తేల్చి చెప్పింది. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశంలోనూ అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు రష్యాపై మండిపడ్డాయి. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా భయానక పరిణామాలు నెలకొంటాయని తెలిపాయి. మరోవైపు.. తాము శాంతిని కోరుకుంటున్నామని, తమ భూభాగాన్ని కోల్పోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌ స్కీ సైతం స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని