Flight Accidents: గగనతలంలో పెను విషాదాలు ఇవే..

చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బోయింగ్‌ విమానం పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్నది

Published : 22 Mar 2022 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోయింగ్‌ విమానం పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారన్నది ఇంకా స్పష్టత లేనప్పటికీ.. ప్రమాద తీవ్రతను బట్టి ఇందులో ఎవరూ బతికే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే గతంలోనూ ఇలాంటి భారీ విమాన ప్రమాదాలు సంభవించి.. పెను విషాదాల్ని నింపాయి. అవేంటి.. ఎప్పుడు జరిగాయో ఓసారి చూద్దాం..

2020 జనవరి 10: 

ఇరాన్‌ అమెరికా మధ్య ఘర్షణల్లో ఓ ఉక్రెయిన్‌ విమానం నేలకూలింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం టెహ్రాన్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 176 మంది మృతిచెందారు. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణి దాడి కారణంగానే చోటుచేసుకున్న ఈ ఘటన పట్ల అప్పట్లో యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

2019 మార్చి 10: 

ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానం  ఆ దేశ రాజధాని నగరం అడిస్‌ అబాబా నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 157 మంది మరణించారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాతే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. కొన్ని దేశాల్లో వీటిపై నిషేధం కూడా విధించారు.

2018 అక్టోబరు 29: 

ఇండోనేషియాలోని లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 విమానం జావా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది సహా 189 మంది జలసమాధి అయ్యారు. జకార్తా నుంచి సుమత్రా దీవికి బయల్దేరిన ఈ విమానం టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే కుప్పకూలింది.

2018 మే 18: 

క్యూబాలోని ప్రభుత్వ విమాన సంస్థకు చెందిన విమానం ఒకటి టేకాఫ్ అయిన కాసేపటికి కూలిపోయింది. ఈ ఘటనలో 110 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా. .ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్యూబా విమానయాన చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం అని చెబుతుంటారు. ఈ ప్రమాదంలోనూ కూలిపోయింది బోయింగ్‌ 737 విమానమే కావడం గమనార్హం.

2018 ఏప్రిల్‌ 11: 

అల్జీరియాలో 257 మందితో ప్రయాణిస్తోన్న మిలిటరీ విమానం ఒకటి బౌఫారిక్‌ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది.

2017 జూన్‌ 7: 

మయన్మార్‌కు చెందిన మిలిటరీ రవాణా విమానం ఒకటి యాంగుంగ్‌ వెళ్తుండగా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 122 మంది జలసమాధి అయ్యారు. 

2009 జూన్‌ 1: 

బ్రెజిల్ నుంచి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ బయల్దేరిన ఎయిర్‌ ఫ్రాన్స్‌ 447 విమానం అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 228 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదేగాక, గతేడాది భారత్‌లోనూ ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక సహా పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయాణిస్తోన్న మిలిటరీ హెలికాప్టర్‌ తమిళనాడులో కూలిపోయింది. ఈ ఘటనలో రావత్‌ దంపతులు సహా 14 మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని