Motorola: చైనా చేతికి మోటోరోల వ్యాపార రహస్యాలు..!

అమెరికాకు చెందిన దిగ్గజ టెలికం సంస్థ  మోటోరోలకు చెందిన కీలక సాంకేతికత, రహస్యాలు చైనా కంపెనీ తస్కరించింది. అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌

Published : 09 Feb 2022 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన దిగ్గజ టెలికం సంస్థ  మోటోరోలకు చెందిన కీలక సాంకేతికత, రహస్యాలను చైనా కంపెనీ తస్కరించింది. అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ మేరకు ఆరోపణలు చేసింది. దీనిపై చికాగోలో కేసు నమోదు చేశారు. చైనాకు చెందిన టెలికమ్యూనికేషన్‌ కంపెనీ హైటెర సంస్థ ఒక పథకం ప్రకారం మోటో సాంకేతిక రహస్యాలను దక్కించుకొంది. దీనికి కొందరు మోటో ఉద్యోగులను పావులుగా వాడుకొంది. గతంలో కూడా చైనా సంస్థలు అమెరికన్‌ టెలికం సంస్థల రహస్యాలను దోచుకొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

షెన్‌జన్‌ కేంద్రంగా పనిచేసే హైటెర సంస్థ కుట్రపూరితంగా మలేసియాలోని మోటోరోల సంస్థ ఉద్యోగులును నియమించుకొంది. మొబైల్‌ వినియోగించే రేడియో టెక్నాలజీకి  సంబంధించిన పత్రాలను వారి ద్వారా సంపాదించింది. మోటో సంస్థ మొబైల్‌ ఫోన్లను వాకీ టాకీ వలే వినియోగించేందుకు ఉద్దేశించి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 2007 నుంచి 2020 వరకు దొంగిలించిన పత్రాలతో సొంతగా అటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి హైటెర సంస్థ ప్రయత్నించింది. 

ఈ వ్యవహారానికి పాల్పడిన కొందరు ఉద్యోగులు చేసిన ఈమెయిల్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిల్లో టెక్నాలజీ దొంగతనం విషయం కూడా ప్రస్తావించారు. హైటెర సంస్థకు మొత్తం 10చోట్ల డెవలప్‌ సెంటర్స్‌ ఉన్నాయి. చైనా, జర్మనీ, కెనడా, గ్రేట్‌ బ్రిటన్‌, స్పెయిన్‌, కెనడా వంటి చోట్ల ఉన్నాయి. ఈ సంస్థ చేసిన టూవే రేడియోలను తాజాగా బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో భద్రతా సిబ్బంది వాడుతున్నారు.  

తాజాగా చికాగోలో నమోదైన కేసులో హైటెరప సంస్థపై నేర నిరూపణ జరిగితే భారీగా అపరాధ రుసం చెల్లించాల్సి ఉంటుంది. ఆ సంస్థ దొంగిలించిన టెక్నాలజీ విలువకు మూడు రెట్ల వరకు ఈ రుసుం ఉండొచ్చు. ఇక ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. కానీ, వ్యక్తుల పేర్లు తెలియకపోవడం, నిందితులను అప్పగించేందుకు చైనా సుమఖంగా ఉండకపోవడంతో ఈ కేసు  వెంటనే తేలే అవకాశం లేదు. 

మోటో సంస్థ రహస్యాలను దొంగిలించిన కేసులో హంజువాన్‌ జిన్‌ అనే మహిళా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌కు  నాలుగేళ్లు జైలు శిక్షపడింది. తాజా కేసులో జిన్‌ పేరును ప్రస్తావించలేదు. 2007లో జిన్‌ రెండు కంపెనీల్లో ఒకేసారి పనిచేసింది. మోటో సంస్థలో ఓ నమ్మకమైన ఉద్యోగి వలే వ్యవహరిస్తూ కీలక ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొంది. అప్పటికే ఆమె చైనా సంస్థ సున్‌ కైసెన్స్‌లో కూడా పనిచేస్తోంది.  దాదాపు 1000 కీలక పత్రాలను సంపాదించినా ఆమె చైనా పారిపోయేందుకు చికాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంది. అక్కడ సాధారణ తనిఖీల్లో ఆమె వద్ద ఉన్న ఫైల్స్‌ బయటపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని