Mount Everest: అంతటి ఎవరెస్టు.. ఆయన ముందు దిగదుడుపే!

హిమాలయాలను అధిరోహించడం సవాళ్లతో కూడుకున్న విషయం! అందులోనూ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘మౌంట్‌ ఎవరెస్ట్‌’ను ఎక్కడమంటే ప్రాణాలకు తెగించినట్లే! అలాంటి శిఖరాన్ని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 సార్లు పాదాక్రాంతం...

Published : 08 May 2022 16:43 IST

26 సార్లు అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన నేపాలీ షెర్పా

ఖాఠ్‌మండూ: హిమాలయాలను అధిరోహించడం సవాళ్లతో కూడుకున్న విషయం. అందులోనూ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘మౌంట్‌ ఎవరెస్ట్‌’ను ఎక్కడమంటే ప్రాణాలకు తెగించినట్లే! అలాంటి శిఖరాన్ని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 సార్లు పాదాక్రాంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు నేపాల్‌కు చెందిన కామీ రీటా షెర్పా. ఈ క్రమంలో ఏడాది క్రితం నెలకొల్పిన తన రికార్డును తానే బద్దలుకొట్టడం గమనార్హం. నేపాల్‌ పర్యాటక శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 52 ఏళ్ల కామీ తాజాగా శనివారం మరోసారి ఎవరెస్టును ఎక్కి.. ఈ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సంప్రదాయ ఆగ్నేయ మార్గంలో 10 మంది ఇతర అధిరోహకులకూ ఆయన నాయకత్వం వహించారు. కామీ రీటా తన రికార్డును తానే అధిగమించి.. సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు కాఠ్‌మండూలోని పర్యాటకశాఖ డైరెక్టర్ జనరల్ తారానాథ్ అధికారి తెలిపారు.

ఈ శిఖరాగ్రానికి చేరుకునేందుకు.. కామీ రీటా ఎంచుకున్న మార్గం 1953లో న్యూజిలాండ్‌కు చెందిన సర్ ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్‌కు చెందిన షెర్పా టెన్సింగ్‌ నార్కే ప్రారంభించారు. ఎవరెస్టును ఎక్కిన మొదటి వ్యక్తులుగా ఈ ఇద్దరికి గుర్తింపు ఉంది. కాలక్రమంలో.. ఈ మార్గం అత్యంత ఆదరణ పొందింది. ఇదిలా ఉండగా.. నేపాల్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు 316 అనుమతులు జారీ చేసింది. మే వరకు ఈ సీజన్‌ కొనసాగనుంది. గత ఏడాది రికార్డు స్థాయిలో 408 పర్మిట్‌లు ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్యం కోసం పర్వతారోహకులపై ఎక్కువగా ఆధారపడే ఈ హిమాలయ దేశం.. 2019లో మాత్రం పర్వత ప్రాంతాల్లో రద్దీకి, అనేక మంది సాహసికుల మరణాలకు కారణమయిందనే విమర్శలు ఎదుర్కొంది. హిమాలయన్ డేటాబేస్ ప్రకారం 1953 మొదలు ఇప్పటివరకు 10,657 సార్లు ఈ పర్వతాన్ని అధిరోహించారు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువసార్లు ఎక్కారు. 311 మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని